23 వరకు పోలీసు కస్టడీలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ?

Telugu Lo Computer
0


తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసం చేశారనే ఆరోపణలతో అరెస్టైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసుల ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు. కేసు పూర్తి స్థాయి విచారణ కోసం పోలీసులు కస్టడీ కోరగా ఏడు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో చంచల్‌గూడ జైలుకు వెళ్లిన పోలీసులు ప్రణీత్‌రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఆయన పోలీసు కస్టడీలో ఉండనున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ డీఎస్పీగా పనిచేసిన ప్రనీత్‌రావుపై ఆధారాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ టాంపరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు అప్పగించిన పనినే కాకుండా.. ఇతరుల ప్రొఫైళ్లను రహస్యంగా తయారు చేశారనే ఆరోపణలు ప్రణీత్‌రావు ఎదుర్కొంటున్నారు. అత్యంత రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని పెన్‌డ్రైవ్‌లో పెట్టుకున్నారని, ఆయన అక్రమాలు బయటపడకుండా 42 హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేశారని పోలీసులు తమ రిమాండ్ రిపొర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రావును విచారించేందుకు ఆయనను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మొదట చంచల్‌గూడ జైలు నుంచి వైద్య పరీక్షల కోసం ఆయనను తీసుకెళ్లారు. ఆ తర్వాత విచారణకు తరలించారు. ప్రస్తుతం పోలీసు అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకెవరున్నారు.. ఏవరు చేయమంటే చేశారు.. ఆధారాలు ఎందుకు ధ్వంసం చేయాల్సిన వచ్చిందనే కోణంలో ఆయనను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావు విచారణ తర్వాత మరింతమందిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)