ఆమ్ ఆద్మీ నేతలకు రూ.100 కోట్ల ఇచ్చిన కవిత !

Telugu Lo Computer
0


ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత విచారణను ఎదుర్కొంటోన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించింది. ఈ కేసులో కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ కూడా ఈడీ రాడార్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆయనకూ ఈడీ అధికారులు నోటీసులను జారీ చేశారు. ఆయనతో పాటు మరో నలుగురు తాజాగా ఈడీ నుంచి నోటీసులను అందుకున్న వారిలో ఉన్నారు. కవిత కార్యాలయంలో ప్రజా సంబంధాల అధికారిగా పని చేస్తోన్న రాజేష్‌, మరో ముగ్గురికి ఈ నోటీసులు అందాయి. ఈ కేసులో ముమ్మర దర్యాప్తు సాగిస్తోన్న ఈడీ అధికారులు మరో అడుగు ముందుకేశారు. కవితకు చెందిన ఆస్తులను అటాచ్ చేశారు. వాటి విలువ 128.79 కోట్ల రూపాయలు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అందుకే ఆస్తులను అటాచ్ చేశారు. దీనిపై ఓ అధికారిక ప్రకటనను ఈడీ అధికారులు విడుదల చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ వారికి 100 కోట్ల రూపాయల మేర ముడుపులను బదలాయించడంలో కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఆ తరువాత కూడా మద్యం హోల్‌సేల్ అమ్మకం దారుల నుంచి సేకరించిన నిధుల పంపిణీ కొనసాగినట్లు వివరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు, తనిఖీలను నిర్వహించామని పేర్కొన్నారు. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి పలు ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు వివరించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ ఎంపీ సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌ను అరెస్ట్ చేశామని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)