మణిపూర్‌లో వినూత్న నిరసనకు దిగిన పోలీసులు !

Telugu Lo Computer
0


ణిపూర్‌లో ఏఎస్పీ స్థాయి అధికారి నివాసంపై దాడి జరిపి ఆయన్ని, ఆయన సిబ్బందిని గుర్తు తెలియని ఆగంతకులు అపహరించుకుని పోయారు. ఈ కిడ్నాప్‌ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను ఖండిస్తూ ఆ అధికారికి సంఘీభావంగా పోలీసు కమాండోలు వినూత్న నిరసనకు దిగారు. బుధవారం ఉదయం కొద్దిసేపు ఆయుధాలను విడిచిపెట్టి విధులకు హాజరయ్యారు. ఏఎస్పీ అపహరణకు గురయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి గంటల వ్యవధిలోనే ఆయన్ను విడిపించినట్లు మణిపూర్‌ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం పశ్చిమ ఇంఫాల్‌లోని అదనపు ఎస్పీ అమిత్‌సింగ్‌ ఇంటిపై సుమారు 200 మంది సాయుధులు దాడి చేశారు. ఆయనతోపాటు మరొకరిని అపహరించుకుపోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అంతకుముందు వాహనం దొంగిలించారనే ఆరోపణలతో అరంబై టెంగోల్‌ గ్రూప్‌నకు చెందిన ఆరుగురు వ్యక్తులను ఏఎస్పీ అమిత్‌ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఆ వర్గం వాళ్లే.. విడిచిపెట్టాలని డిమాండ్‌ చేస్తూ దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు తెలిపారు. మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఆ రాష్ట్ర హోంశాఖ అప్రమత్తమైంది. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించాలని కిందటి ఏడాది మార్చి 27న కేంద్ర గిరిజన శాఖకు హైకోర్టు ప్రతిపాదన చేసింది. అయితే, వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దంటూ నాగా, కుకీజొమీ తెగలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో.. మణిపూర్‌లో ఘర్షణలు.. హింస చెలరేగాయి. అయితే.. రాష్ట్రంలో కుకీలు, మెయితీల మధ్య వైరానికి కారణమైన పేరాను మణిపూర్‌ హైకోర్టు తాజాగా తొలగించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)