మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారా మెడికల్‌ కాలేజీలు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని కొడంగల్‌లో మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారా మెడికల్‌ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు కామన్‌ పాలసీని తీసుకురావాలని ఆదేశించారు. సచివాలయంలో సోమవారం వైద్యారోగ్యశాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  రాష్ట్రంలో ప్రతి ఒకరికి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ యూనిక్‌ నంబర్‌ కేటాయించాలని, దీనిని ఆరోగ్యశ్రీతో అనుసంధానం చేయాలని చెప్పారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్‌ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలన్నారు. టీచింగ్‌ హాస్పిటళ్లు, ప్రభుత్వ ఆసుపత్రిలకు పెండింగ్‌లో ఉన్న రూ.270 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి నెల 15వ తేదీలోగా ప్రభుత్వ ఆసుపత్రిలకు, మూడు నెలలకోసారి ప్రైవేటు ఆసుపత్రిలకు ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయాలని స్పష్టం చేశారు. వరంగల్‌ హెల్త్‌ సిటీ, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌, అల్వాల్‌లో టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్ ల నిర్మాణాలు వేగంగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. వైద్యుల కొరత లేకుండా ఆసుపత్రిలకుమెడికల్‌ కాలేజీలను అనుసంధానం చేయాలని చెప్పారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో 'వారసత్వ భవనం'కు సంబంధించి కోర్టు సూచనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. మెడికల్‌ కాలేజీలతో అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను ఫార్మా కంపెనీలకు అప్పగించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్‌ శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శేషాద్రి, సీఎం జాయింట్‌ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చోంగ్తు , కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆర్వీ కర్ణణ్‌, డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ కమలాసన్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో విచాలాచ్చి పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)