పాత పెన్షన్‌పై ఆర్బీఐ హెచ్చరిక !

Telugu Lo Computer
0


ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమలు పట్ల భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సంచలన వ్యాఖ్యలు చేసింది. రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులకు కరువు భత్యం (డీఏ) ఆధారిత పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) దిశగా వెళ్లాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కష్టాలు తప్పవని హెచ్చరించింది. 'ఓపీఎస్' అమలు చేసే రాష్ట్రాల ఆర్థిక వనరులపై భారీ ఒత్తిడి పడుతుందని, ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు పరిమితులు ఏర్పడతాయని పేర్కొంది. 'రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు: 2023-24 బడ్జెట్లపై ఒక అధ్యయనం' అనే పేరుతో నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ.. నాన్ మెరిట్ గూడ్స్ అండ్ సర్వీసెస్, సబ్సిడీలు, ట్రాన్స్ ఫర్లు, గ్యారంటీలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్య లభ్యతను ప్రమాదంలో పడేస్తాయి అని పేర్కొంది. తాము రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఎన్పీఎస్ స్థానే పాత పెన్షన్ స్కీం అమలు చేస్తామని కేంద్రానికి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ)కు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదే బాటలో పయనించాలని భావిస్తున్నాయని వార్తలొచ్చిన నేపథ్యంలో 'ఓపీఎస్'కు మళ్లడంలో గల ఇబ్బందులపై ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఎన్పీఎస్ నుంచి ఓపీఎస్' కు మళ్లడం వల్ల ఆయా రాష్ట్రాల అభివృద్ధి, పెట్టుబడి వ్యయాలకు పరిమితులు ఏర్పడతాయని ఆర్బీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. ఎన్పీఎస్ కంటే 4.5 రెట్లు అదనపు ఆర్థిక భారం పడుతుందని పేర్కొంది. 2060 నాటికి అదనపు ఆర్థిక భారం.. జీడీపీలో 0.9 శాతానికి చేరుతుందని హెచ్చరించింది. ఇప్పటికే ఉన్న పాత ఓపీఎస్ పెన్షనర్లకు అదనంగా చివరి బ్యాచ్ సిబ్బంది 2040 దశకం ప్రారంభంలో జత కలుస్తారని పేర్కొంది. ఓపీఎస్'కు మళ్లడం వల్ల ఇప్పటి వరకు అమలు చేసిన సంస్కరణల ఫలాలను తక్కువ చేయడమే అవుతుందని, భవిష్యత్ తరాల ప్రయోజనాలను బలి చేయడమేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు శాతాన్ని దాటేస్తుందని, ఇది జాతీయ సగటు 3.1 శాతం కంటే ఎక్కువ అని పేర్కొంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల రుణ భారం 35 శాతాన్ని దాటితే, జాతీయ సగటు 27.6 శాతం మాత్రమే నని గుర్తు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)