'ఐరన్‌ డోమ్‌'పై హెజ్‌బొల్లా దాడులు !

Telugu Lo Computer
0


మాస్‌ నెట్‌వర్క్‌ను అంతం చేయడమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌ కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లా  ఇజ్రాయెల్‌పై ఎదురుదాడులు చేస్తోంది. తాజాగా అత్యంత దుర్భేద్యమైన ఐరన్‌ డోమ్‌ గగనతల రక్షణ వ్యవస్థపై ఈ సంస్థ దాడి చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్‌కు గణనీయంగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని కబ్రి ప్రాంతంలో రెండు ఐరన్‌ డోమ్‌ వ్యవస్థలపై దాడి చేసినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. దీంతో రెండు లాంచింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. అయితే, హెజ్‌బొల్లా ప్రకటనపై ఇజ్రాయెల్‌ సైన్యం స్పందించలేదు. మరోవైపు, ఈ మిలిటెంట్‌ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగనట్లు తెలుస్తోంది. దీంతో ఇజ్రాయెల్‌-లెబనాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐరన్‌ డోమ్‌ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటి. ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్‌ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. దీనికి అమెరికా తోడ్పాటు అందించింది. దీన్ని ఇజ్రాయెల్‌లో పలు చోట్ల మోహరించారు. శత్రువులు ప్రయోగించే రాకెట్లను ఐరన్‌ డోమ్‌లోని డిటెక్షన్‌ అండ్‌ ట్రాకింగ్‌ రాడార్‌ పసిగట్టి.. దాని గమనానికి సంబంధించిన సమాచారాన్ని ఆయుధ నియంత్రణ వ్యవస్థకు చేరవేస్తుంది. ఆ వ్యవస్థ.. రాకెట్‌ దిశగా క్షిపణిని ప్రయోగించి ప్రత్యర్థి అస్త్రాన్ని గాల్లోనే ధ్వంసం చేస్తుంది. 2006లో జరిగిన లెబనాన్‌ ఘర్షణల సమయంలో హెజ్‌బొల్లా.. ఇజ్రాయెల్‌పై వేల రాకెట్లతో విరుచుకుపడింది. అనేకమంది పౌరులు అప్పట్లో ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి దాడులను తిప్పికొట్టడానికి గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఇజ్రాయెల్‌ నిర్ణయించింది. దీంతో 2011లో ఐరన్‌ డోమ్‌ను వినియోగంలోకి తీసుకొచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)