ఆరు గ్యారంటీలకు అప్లికేషన్ల వెల్లువ !

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు అప్లికేషన్లు వెల్లువెత్తుతుయి. ప్రజాపాలన రెండో రోజూ రాష్ట్రంలో 8,12,862 దరఖాస్తులు అందాయి. జీహెచ్​ఎంసీ, ఇతర మున్సిపాలిటీల్లో కలిపి 4.89 లక్షలు, గ్రామాల్లో 3.23 లక్షలు వచ్చాయి. దీంతో గురు, శుక్ర రెండు రోజులు కలిపి ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 15 లక్షలు దాటింది. కొత్త రేషన్ కార్డుల కోసం కూడా ప్రజలు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. తెల్లకాగితంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రేషన్ కార్డు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నారు. గ్రామాలు, మున్సిపాలిటీ వార్డుల్లో అప్లికేషన్లు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో జనం రావడంతో శుక్రవారం రాష్ట్రంలోని కొన్నిచోట్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయాన్నే గ్రామాల్లో, వార్డుల్లో ఉన్న జనాలు కౌంటర్ల దగ్గరకు వెళ్లి క్యూ లైన్​లో చెప్పులు పెట్టి మరీ అప్లికేషన్లు సమర్పించారు.  చాలా చోట్ల దరఖాస్తు ఫారాలు ప్రజలకు అందకపోవడంతో ప్రజలు జిరాక్స్​సెంటర్ల దగ్గరకు వెళ్లి కొనుగోలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో సర్కారు స్పందించింది. అభయహస్తం దరఖాస్తు ఫారాల కొరత లేదని, అందరికీ ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ప్రజలెవరూ బయట కొనుగోలు చేయవద్దని సీఎస్​శాంతికుమారి సూచించారు. ఎవరైనా దరఖాస్తు ఫారాలు బయట అమ్మినట్లు గుర్తిస్తే.. వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. క్యాస్ట్​, ఆదాయం సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడవద్దని ఆ సర్టిఫికెట్లు అవసరం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని, అభయ హస్తం దరఖాస్తులు నింపడంలో ప్రజలకు సహకరించేలా వలంటీర్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. షామియానా, బారికేడింగ్, తాగునీరు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగేలా జిల్లా అధికారులందరూ కృషి చేయాని సూచించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)