పువ్వాడ పువ్వులు కావాలా? తుమ్మల తుప్పలు కావాలా?

Telugu Lo Computer
0


తెలంగాణలోని ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వర్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  ఖమ్మం ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలే స్యయంగా చూశారని అన్నారు. పువ్వాడ పువ్వులు కావాలా? తుమ్మల తుప్పలు కావాలా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తుమ్మలను గెలిపిస్తే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటాయి. ఇక మీ ఇష్టమని ఖమ్మం ప్రజలకు స్పష్టం చేశారు. ప్రభుత్వ విజన్ పువ్వాడ మిషన్ తో ఖమ్మం అభివృద్ధి సాధ్యమైందన్నారు. వాడవాడలో పువ్వాడ అజయ్ అని పత్రికల్లో వార్తలు వచ్చేవని గుర్తు చేశారు. రూ. 700 కోట్లు ఖర్చు చేసి ఈ జిల్లాను పువ్వాడ అభివృద్ధి చేయించారని కేసీఆర్ తెలిపారు. పువ్వాడ అజయ్‌ను గెలిపిస్తే మళ్లీ మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని హామీ ఇచ్చారు కేసీఆర్. పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయి మూలనపడి ఉంటే తుమ్మల నాగేశ్వరరావును పిలిచి మంత్రి పదవి ఇచ్చానని కేసీఆర్ చెప్పారు. తుమ్మల వల్ల ప్రజలకు జరిగిన మేలు శూన్యమని విమర్శించారు. ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేస్తానని ఓ అర్భకుడు అంటున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏమైనా ఖమ్మం జిల్లాను ఆయన గుత్తకు తీసుకున్నారా? అని మండిపడ్డారు. కేసీఆర్ బతికి ఉన్నంత వరకూ తెలంగాణ లౌకిక రాజ్యంగానే ఉంటుందన్నారు. రాబోయే కాలమంతా ప్రాంతీయ పార్టీలదేనని అన్నారు. ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైన ప్రాంతమని కేసీఆర్ అన్నారు. మనదేశంలో ప్రజాస్వామ్య పరిణితి రావాలంటే యువత ముందుకు రావాలన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. అభ్యర్థుల గుణగణాలు, వారి వెనుక ఉన్న పార్టీ చరిత్రను గమనించి ఓటేయాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు. ఓటర్లు పరిణితితో ఓటువేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందన్నారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)