గ్రీసు తీరంలో కార్గో నౌక మునక !

Telugu Lo Computer
0


గ్రీసు తీరంలో ఓ కార్గో నౌక మునిగిపోయింది. బలమైన గాలులతో సముద్రం అల్లకల్లోలంగా మారడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకరిని రక్షించగా 13 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 14 సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది ఈజిప్టునకు చెందినవారు కాగా.. నలుగురు భారతీయులు, ఇద్దరు సిరియాకు చెందిన వారున్నారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నుంచి రాప్టర్‌ అనే కార్గో నౌక.. 6వేల టన్నుల ఉప్పుతో తుర్కియేలోని ఇస్తాంబుల్‌ బయలుదేరింది. మార్గమధ్యలో ఆదివారం ఉదయం 7గంటలకు నౌకలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే సమీప కేంద్రానికి ప్రమాద సంకేతాన్ని పంపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ నౌక కనిపించకుండా పోయినట్లు స్థానిక కోస్ట్‌ గార్డ్‌ వెల్లడించింది. రంగంలోకి దిగిన రెస్య్క్యూ బృందాలు ముమ్మర గాలింపు మొదలుపెట్టాయి. ఎనిమిది నౌకలు, రెండు హెలికాప్టర్లతోపాటు గ్రీస్‌కు చెందిన ఓ యుద్ధ నౌకతో ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇందులో ఒక ఈజిప్టు దేశీయుడిని రక్షించినప్పటికీ.. 13 మంది ఆచూకీ గల్లంతైనట్లు గుర్తించారు. సముద్రంలో భీకర గాలులతో ప్రతికూల వాతావరణం ఉండడంతో గాలింపు కష్టతరంగా మారిందని రెస్య్కూ సిబ్బంది వెల్లడించారు

Post a Comment

0Comments

Post a Comment (0)