65% కోటా బిల్లుకు బీహార్‌ అసెంబ్లీ ఆమోదం !

Telugu Lo Computer
0


బీహార్‌లో 65 శాతం కులాలవారి కోటాకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీలో గురువారం తీసుకువచ్చిన బిల్లు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలు, అత్యంత పేదరికంలో ఉన్న బిసిలకు రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలలో, విద్యాసంస్థలలో 65 శాతం రిజర్వేషన్ల కేటాయింపులకు ఈ బిల్లును ఉద్ధేశించారు. రిజర్వేషన్ల కోటా 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు నుంచి నిర్ధేశిత రూలింగ్ ఉంది. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించడం సుప్రీంకోర్టు పరిమితిని దాటినట్లు అయింది. అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇక గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సంతకంతో ఆమోద ముద్ర పొందాల్సి ఉంటుంది. తరువాత ఇది కోటా పెంపు చట్టంగా మారుతుంది. ఇప్పుడున్న కోటా చట్టానికి సవరణల బిల్లును ఇప్పటి అసెంబ్లీ సెషన్‌లోనే తీసుకువస్తామని రెండుమూడు రోజుల క్రితమే ముఖ్యమంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు గురువారం ఈ బిల్లు తీసుకువచ్చారు. రాష్ట్రంలో కులగణన క్రమంలో పలు సామాజిక వర్గాల ఆర్థిక సామాజిక పరిస్థితి గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని, వీటిని పరిగణనలోకి తీసుకుని ఆయా కులాలు వర్గాలకు కోటా పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఈ బిల్లు ప్రవేశపెట్టే దశలో తెలిపారు. మహిళలపై వివాదాస్పదమైన లైంగిక వ్యాఖ్యలకు దిగి చిక్కుల్లో పడ్డ ముఖ్యమంత్రి నితీశ్‌కు గురువారం కూడా అసెంబ్లీలోపలా, వెలుపల తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. ప్రతిపక్ష బిజెపి ఎమ్మెల్యేలు, ప్రత్యేకించి మహిళా సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు ఇతరత్రా గందరగోళానికి దిగిన దశలోనే సవరణల బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందింది.

Post a Comment

0Comments

Post a Comment (0)