దేశంలోని అతి చిన్న పోలింగ్ కేంద్రం షెరదాండ్ !

Telugu Lo Computer
0


దేశంలో అతి చిన్నపోలింగ్ బూత్ ఛత్తీస్‌గఢ్‌లోని భరత్‌పూర్ సన్హాట్‌లో షెరదాండ్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ కేవలం మూడే ఇళ్లు ఉంటాయి. ఈ మూడు ఇళ్లకు కలిపి ఐదుగురు ఓటర్లు ఉన్నారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 143వ పోలింగ్ స్టేషన్ ఇది. ఈ స్టేషన్ కేవలం ఈ ఐదుగురి కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. నవంబర్ 7న ఇక్కడ పోలింగ్ జరుగనుంది. భరత్‌పూర్ సన్హాట్‌లో షెరదాండ్ గ్రామంలో 2008లో కేవలం ఇద్దరు ఓటర్ల కోసం మాత్రమే ఒక పోలింగ్ కేంద్రాన్ని ఒక పూరిగుడిసెలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పడే ఈ గ్రామం గురించి ప్రపంచానికి తెలిసింది. ఒక ఇంట్లో అరవై ఏళ్ల వయసున్న ఓ వృద్ధుడు ఉన్నాడు. అతని పేరు మహిపాల్ రామ్, అతను ఒక్కడే ఈ గుడిసెలో ఉంటాడు. ఇక రెండో ఇంట్లో రామ్‌ప్రసాద్ చెర్వా అనే వ్యక్తి తన భార్య సింగారో, నలుగురు పిల్లలతో కలిసి ఈ గ్రామంలో నివసిస్తున్నాడు. మూడో ఇంట్లో దస్రు రాము అనే వ్యక్తి తన భార్య సుమిత్ర, ఒక కుమార్తె, మరో కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. ఈ మూడిళ్లకు కలిపి ఐదుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ముగ్గురు మగవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు. ఈ ఐదుగురు ఓటర్లలో దస్రు రాము ఐదేళ్ల క్రితం జష్‌పూర్ నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాడు. ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్ బృందం రెండు రోజుల ముందే ఇక్కడికి వస్తుంది. పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకూ రెండు రోజులపాటు ఇక్కడే ఉంటుంది. పోలింగ్ జరిగిన ప్రతిసారి ఇక్కడ వంద శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. 

Post a Comment

0Comments

Post a Comment (0)