చంద్రబాబు లేకుండా తొలిసారిగా టీడీపీ విస్తృతస్థాయి సమావేశాలు !

Telugu Lo Computer
0


చంద్రబాబు నాయుడు లేకుండానే టీడీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని అమరావతిలో తొలిసారిగా నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొని నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ టీడీపీకి సంక్షోభాలు కొత్తేం కాదని, చంద్రబాబుని అరెస్ట్ చేస్తే టీడీపీ నేతలు భయపడతారని అనుకుంటున్నారు కానీ టీడీపీ నేతలు భయపడేవారు కాదన్నారు. భయం మన బయోడేటాలోనే లేదు. ఇందిరాగాంధీకే భయపడలేదు. మరుగుజ్జు జగన్ కు భయపడతామా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేశాక తన తల్లి భువనేశ్వరి తొలిసారిగా బయటకు వచ్చారని, అటువంటి ఆమెపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తన తల్లి, తన భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు దారుణంగా మాట్లాడారారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిపై కేసు పెడతామని సీఐడీ బెదిరించిందంటూ లోకేశ్ వెల్లడించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే టీడీపీ నేతలు పోరాడి తిరిగి ఆయన్ని సీఎంను చేశారని గుర్తు చేశారు. కానీ అప్పటి సంక్షోభం వేరు.. ఈ సంక్షోభం వేరు.. చంద్రబాబును జైల్లో ఉంటే టీడీపీ భయపడుతోందని అనుకున్నారు.. కానీ భయం అంటే ఏమిటో తెలియని టీడీపీ నేతలు చంద్రబాబు కోసం పోరాడుతున్నారని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి టీడీపీని ఇబ్బంది పెడుతున్నారని, చంద్రబాబు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే సైకో జగన్ లక్ష్యం అంటూ దుయ్యబట్టారు. 2019కు ముందు తనపై కేసుల్లేవని ఇప్పుడు ఎన్నో కేసులు ఉన్నాయని తెలిపారు. రైతుల కోసం, మహిళల కోసం, నిరుద్యోగుల కోసం ప్రశ్నించడమే చంద్రబాబు చేసిన నేరమా? ఇసుక దోపిడీ.. మద్యం మాఫియా గురించి మాట్లాడడమే చంద్రబాబు చేసిన తప్పా? ప్రజల కోసమే చంద్రబాబు అహర్నిశలు పోరాడారు, అందుకే అరెస్ట్ చేశారని ఆరోపించారు. జగన్ సీఎం అయిన రోజు నుంచే విధ్వంసం కొనసాగుతోందంటూ మండిపడ్డారు. ఐటీ రిటర్న్స్ సాకుగా చూపి తన తల్లిపై కేసు పెడతామని బెదిరించారని తెలిపారు. తన తల్లికి సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలు తెలియవని.. అటువంటి ఆమెను కూడా బెదరించారని మండిపడ్డారు. స్కిల్ కేసులో ఆధారాల్లేక కార్యకర్తలిచ్చిన పార్టీ ఫండ్.. అవినీతి సొమ్ము అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ ఏం జరగకూడదని అనుకున్నారో.. అదే జరిగిందని అదే టీడీపీ-జనసేన పొత్తు అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ, జనసేనకు పొత్తు కుదరకూడదని ఎన్నో వ్యాఖ్యలు చేశారని, ఈ రెండింటికి పొత్తు కుదురుతుందని వైసీపీ భయపడిందన్నారు. చివరకు వైసీపీ భయపడిందే జరిగింది అన్నారు. టీడీపీ- జనసేన మధ్య విబేధాలు వచ్చేలా పేటీఎం బ్యాచ్ ప్రయత్నం చేస్తోందన్నారు. చంద్రబాబు, పవన్ విషయంలో వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని.. కానీ మీ ఇళ్లల్లో ఏం జరుగుతుందో మేం నోరు విప్పితే తల ఎత్తుకోలేరు అంటూ వైసీపీ నేతలపను హెచ్చరించారు. అటువంటి వ్యాఖ్యలు చేయటానికి మాకు సంస్కారం అడ్డువస్తోందన్నారు. వ్యక్తిగత విమర్శలు వద్దని చంద్రబాబు మాకు చెప్పారు. మా పార్టీ అధినేత మాకు క్రమశిక్షణ నేర్పారని అన్నారు. రూ. 500 కోట్లతో విశాఖలో భవనం, లక్షల రూపాయలతో బాత్రూంలు నిర్మించుకునే జగన్ పేదవాడంట అంటూ ఎద్దేవా చేశారు. లక్ష రూపాయల చెప్పులేసుకునే జగన్ పేదవాడా అంటూ పశ్నించారు. నవంబర్ ఒకటి నుంచి బాబు ష్యూర్టీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. రాజకీయంగా టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడమే కాదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలను హింసిస్తున్నారు అంటూ  నారా లోకేశ్ మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)