ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 24 మంది మృత్యువాత !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో శంకర్‌రావు చావన్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో గడిచిన 24 గంటల్లో 24 మంది మృత్యువాతపడటం తీవ్ర కలకలం రేపుతోంది. మరణించిన వారిలో 12 మంది నవజాత శిశువులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. సుపత్రిలో మందులు, సిబ్బంది కొరత వల్లే ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాందేడ్‌ ఆసుపత్రిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దురదృష్టవశాత్తు మరో ఏడుగురు రోగులు మరణించారు. వీరిలో చనిపోయిన వారిలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో మంగళవారం ఉదయం నాటికి మరణించిన వారి సంఖ్య 31‍కు చేరింది. తాజా మరణాలకు సంబంధించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఎక్స్‌లో పోస్ట్ ద్వారా తెలియజేశారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. మరణించిన 12 మంది చిన్నారుల్లో ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారని ఆసుపత్రి డీన్ తెలిపారు. చనిపోయిన మిగతా పన్నెండు మంది పెద్దవారిలో పాము కాటుతో సహా వివిధ వ్యాధుల కారణంగా మరణించారని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రి తృతీయ స్థాయి కేర్ సెంటర్ మాత్రమేనని, కానీ చుట్టుపక్కల 70,80 కిలీమీటర్ల పరిధిలో ఉన్న ఏకైక హెల్త్‌ కేర్‌ సెంటర్‌ ఇదే కావడంతో వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారని డీన్‌ తెలిపారు. ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య అధికంగా ఉందని అన్నారు. కొన్నిసార్లు పేషెంట్ల సంఖ్య ఆసుపత్రి బడ్జెట్‌ను మించిపోవడంతో మందుల కొరత ఏర్పడిందని తెలిపారు. హాఫ్‌కిన్ అనే సంస్థ నుంచి మందులను ఆసుపత్రి కొనుగోలు చేయాల్సి ఉందని, అయితే అది జరగడం లేదని అన్నారు డీన్. దీంతో రోగులు స్థానిక మెడికల్‌ షాపుల నుంచి మందులు కొనుగోలు చేసి తీసుకొచ్చిన తర్వాతే రోగులకు మందులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికితోడు అనేకమంది ఆసుపత్రి సిబ్బందిని బదిలీ చేయడం వల్ల రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ ఘటన విషయంలో మహారాష్ట్రలోని శివసేన(షిండే వర్గం), బీజేపీ, ఎన్సీపీ(అజిత్‌ వర్గం) ట్రిపుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నాందేడ్‌ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 నవజాత శిశువులతో సహా 24 మరణాలు మందుల కొరత వల్ల మాత్రమే సంభవించలేదని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగాయని విరుచుకుపడ్డాయి. పండుగలు, పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి, చిన్నారుల మందుల కోసం డబ్బులు కేటాయించకపోవడం సిగ్గు చేటని దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ దృష్టిలో పేదల ప్రాణాలకు విలువ లేదని మండిపడుతున్నాయి. ఎన్సీపీ(శరద్‌ వర్గం) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను డిమాండ్ చేశారు. సంబంధిత మంత్రులను వారి పదవుల నుంచి తొలగించాలని అన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోరారు. ఇక ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట కల్లా కమిటీ తన రిపోర్టు ఇవ్వనుందని మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ డైరెక్టర్ దిలీప్ మైసేకర్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)