నైరుతి రుతుపవనాల తిరోగమనం

Telugu Lo Computer
0

దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలైందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ సారి రుతుపవనాల ఉపసంహరణ సాధారణం కంటే ఎనిమిది రోజులుగా మొదలైందని పేర్కొంది. వాస్తవానికి సెప్టెంబర్‌ 17 వరకు వాయువ్య దిశ నుంచి తిరోగమనం మొదలుకావాల్సి ఉండగా ఈ సారి సెప్టెంబర్‌ 25న మొదలైనట్లు పేర్కొంది. రాజస్థాన్‌లోని నైరుతి ప్రాంతం నుంచి నైరుతి రుతుపవనాలు సోమవారం పూర్తిగా నిష్క్రమించినట్లు భారత వాతావరణశాఖ పేర్కొంది. రుతుపవనాలు తిరోగమనం ఆలస్యం కావడం ఇది 13వ సారి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా జూన్‌ 8న దేశంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే, సెప్టెంబర్‌ 30 వరకు దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వర్షాకాలంలో సాధారణ సగటు 868.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా.. వర్షాపాతం ఏడుశాతం తగ్గింది. రుతుపవనాలు భారత ఉపకండంలో పంటలను ప్రభావితం చేస్తుందని ఐఎండీ పేర్కొంది. రుతుపవనాలు తిరోగమనం ఆలస్యమైతే.. వర్షాకాలం ఎక్కువ కాలం ఉంటుందని, వ్యవసాయరంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని తెలిపింది. వాయువ్య భారతదేశంలో రబీ ఉత్పత్తిలో రుతుపవనాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు తిరుగుముఖం పట్టిన రుతుపవనాలు గంగా మైదానం ద్వారా బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. ఈ క్రమంలో ఈశాన్యం నుంచి తిరోగమనం చెందడంతో వీటిని ఈశాన్య రుతుపవనాలుగా పేర్కొంటారు. వీటితో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)