హరీష్‌ సాల్వే వివాహ వేడుకలో లలిత్‌ మోడీ హాజరుపై రాజకీయ దుమారం !

Telugu Lo Computer
0


మాజీ సొలిసిటర్ జనరల్‌ హరీష్ సాల్వే 68 ఏళ్ల ఏట మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. త్రినా అనే మహిళను ఘనంగా పెళ్లాడారు. కాగా, హరీష్‌ సాల్వే వివాహం ప్రస్తుతం భారత్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. అందుకు కారణం వీరి వివాహానికి లలిత్‌ మోడీ హాజరుకావడమే. లండన్‌ లో ఆదివారం జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, సునీల్‌ మిట్టల్‌, ఎల్‌ఎన్‌ మిట్టల్‌, ఎస్వీ లోహియా, గోపీ హిందూజా వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వీరితోపాటు భారత క్రికెట్ బోర్డు బీసీసీఐని వందల కోట్ల మేర మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొని దేశం విడిచి పరారైన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ కూడా ఈ వివాహానికి హాజరుకావడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. భారత్‌లో 'ఒకే దేశం.. ఒకే ఎన్నిక కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షత వహించనున్నారు. అయితే ఈ కమిటీలో హరీష్‌ సాల్వే కూడా సభ్యుడిగా ఉన్నారు. అత్యున్నత స్థాయి కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి వివాహానికి పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ కేసులో దేశం విడిచి పరారైన లలిత్ మోడీ హాజరు కావడంపై ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఈ మేరకు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రస్థాయిలో స్పందించారు. 'ప్రభుత్వ ఏకరీతి వివాహ చట్టాలపై ఊదరగొడుతున్న వేళ బీజేపీకి చెందిన ప్రముఖ లాయర్‌ మూడో పెళ్లి చేసుకోవడాన్ని నేను పట్టించుకోను. కానీ ప్రతి ఒక్కరూ ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే ? మోదీ ప్రభుత్వానికి ఇష్టమైన న్యాయవాది వివాహానికి.. భారత చట్టాల నుంచి తప్పించుకుని దేశం విడిచి పారిపోయిన వ్యక్తి ఆహ్వానితుడిగా ఉన్నాడు. ఎవరు ఎవరికి సహాయం చేస్తున్నారు..? ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు..? అనేది ఇప్పుడు ప్రశ్న కాదు' అంటూ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రితేశ్ షా కూడా మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 'నీరవ్ మోడీ, లలిత్ మోడీని దొంగలన్నందుకు కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేశారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం 'ఒకే దేశం.. ఒకే ఎన్నిక'పై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీలో సభ్యుడిగా ఉన్న హరీష్‌ సాల్వేతో మనీలాండరింగ్‌ కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్‌ మోడీ ఎంజాయ్‌ చేస్తున్నాడు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు 'వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌' కమిటీ సభ్యుడు హరీష్‌ సాల్వే.. ఇప్పుడు ఇద్దరు మోసగాళ్లు లలిత్‌ మోడీ, మొయిన్‌ ఖురేషీతో సంతోషంగా గడుపుతున్నారు అని కాంగ్రెస్‌ ఓవర్సీస్‌ కో ఆర్డినేటర్‌ విజయ్‌ తొట్టితిల్‌ విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)