కొనసాగుతున్న చంద్రబాబు విచారణ !

Telugu Lo Computer
0


తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాదాపు మూడు గంటలుగా సిట్‌ కార్యాలయంలోనే ఉన్నారు. ఈ రాత్రంతా సీఐడీ ఆఫీసులోనే చంద్రబాబును ఉంచనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 5 గంటల తర్వాత ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే ఆలోచనలో సీఐడీ అధికారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అప్పటి వరకూ సమయం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ లోగా స్కామ్ కు సంబంధించిన ప్రశ్నలతో చంద్రబాబును ఎంక్వైరీ చేస్తున్నారు. స్కామ్ పై 20 కీలక ప్రశ్నలను సంధిస్తున్నారు సీఐడీ అధికారులు. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు చూపించారు. నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు కుంచనపల్లిలోని సిట్‌ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొచ్చారు. న్యాయసహాయం కోసం తమ లాయర్లను కలిసేందుకు అనుమతివ్వాలని సీఐడీ అధికారులు చంద్రబాబు లేఖ రాశారు. ప్రస్తుతం కుంచనపల్లిలోని సిట్‌ కార్యాలయం పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు సిట్‌ కార్యాలయం వద్దకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు వద్ద సిద్ధంగా ఉన్నారు. మరోవైపు సెప్టెంబర్ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ టీడీపీ నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు టీడీపీ నేతలు గవర్నర్ ను కలవనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)