అజయ్‌సింగ్‌ వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ సుప్రీంకోర్టు సమన్లు జారీ

Telugu Lo Computer
0


స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ చీఫ్ అజయ్ సింగ్‌ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. క్రెడిట్ సూయిస్ ధిక్కార కేసులో నాలుగు వారాల్లోగా స్పందించాలని అజయ్‌ సింగ్‌ను ఆదేశించింది.  అజయ్ సింగ్, స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ క్రెడిట్ సూయిస్ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారన్న క్రెడిట్ సూయిస్ అరోపించింది. ఇరుపక్షాల మధ్య జరిగిన సెటిల్మెంట్ ప్రకారం 3.9 మిలియన్ల డాలర్ల బకాయిలు చెల్లించడంలో విఫలమైనందుకు అజయ్‌సింగ్, స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు తాజా సమన్లు జారీ చేసింది. కాగా క్రెడిట్ సూయిస్‌, స్పైస్‌జెట్ మధ్య 2015 నుంచి వివాదం నడుస్తోంది. స్పైస్‌జెట్ యాజమాన్యం సుమారు 24 మిలియన్ డాలర్ల బకాయిలను ఎగ్గొట్టారని క్రెడిట్‌ సూయిస్‌ ఆరోపిస్తోంది. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు చివరికి 2021లో ఎయిర్‌లైన్‌ను మూసివేయాలని సూచించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌తో సుప్రీంకోర్టు మూసివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరుపక్షాలు చర్చలతో ఒక పరిష్కారానికి వచ్చేందుకు అనుమతినిచ్చింది. ఆగస్టు 2022లో తమ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఒప్పందం జరిగిందని ఇరుపక్షాలు కోర్టుకు తెలిపాయి. అయితే, ఒప్పందం ప్రకారం బకాయిలు చెల్లించలేదంటూ క్రెడిట్ సూయిస్ అజయ్ సింగ్‌పై ధిక్కార కేసు వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)