శుభ్‌మన్‌ గిల్‌తో యశస్వి జైస్వాల్ మరో రికార్డు!

Telugu Lo Computer
0


వెస్టిండీస్‌తో శనివారం రాత్రి ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. విండీస్‌ నిర్ధేశించిన 179 పరుగు లక్ష్యాన్ని భారత్ 17 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (84 నాటౌట్‌; 51 బంతుల్లో 11×4, 3×6), శుభ్‌మన్‌ గిల్‌ (77; 47 బంతుల్లో 3×4, 5×6) హాఫ్ సెంచరీలు చేశారు. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసింది. నాలుగో టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అత్యంత పిన్న వయసులో భారత్‌ తరఫున టీ20ల్లో అర్ధ శతకం చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. నాలుగో టీ20 మ్యాచ్‌లో 84 రన్స్ చేసిన యశస్వి వయసు 21 ఏళ్ల 227 రోజులు. తాజాగా హైదెరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ కూడా హాఫ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఇదే సిరీస్‌లోని రెండో టీ20లో 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు. అత్యంత పిన్న వయసులో భారత్‌ తరఫున టీ20ల్లో అర్ధ శతకం చేసిన మొదటి ఆటగాడు కెప్టెన్ రోహిత్ శర్మ. 20 ఏళ్ల 143 రోజుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ బాదాడు. రెండో స్థానంలో తిలక్ వర్మ (20 ఏళ్ల 271 రోజులు) ఉండగా.. మూడో స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (21 ఏళ్ల 38 రోజులు) ఉన్నాడు. నాలుగో ఆటగాడిగా యశస్వి జైస్వాల్‌ ఉన్నాడు. అయితే ఇందులో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటర్లు ఉండడం గమనార్హం. మరోవైపు యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ జోడి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. టీ20ల్లో భారత తరపున రెండో అత్యధిక భాగస్వామ్యం (165) నెలకొల్పిన జంటగా నిలిచారు. రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ రికార్డును వీరు సమం చేశారు. 2017లో శ్రీలంకపై రోహిత్‌-రాహుల్‌ 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జాబితాలో దీపక్‌ హుడా-సంజూ శాంసన్‌ జోడి అగ్ర స్ధానంలో ఉంది. 2022లో ఐర్లాండ్‌పై వీరు 176 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)