రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం !

Telugu Lo Computer
0


లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు హరియాణా రైతులతోపాటు ఖాప్‌ పంచాయతీలు ప్రకటించాయి. శుక్రవారం నిర్వహించనున్న సమావేశంలో తదుపరి కార్యాచరణపై చర్చిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌పేర్కొన్నారు. డిమాండ్లు నెరవేరకపోతే అవసరమైతే రాష్ట్రపతిని కలిసేందుకు సిద్ధమేనన్నారు. రెజ్లర్లకు మద్దతుగా సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పంజాబ్‌, హరియాణాలతోపాటు దిల్లీ, రాజస్థాన్‌లలోనూ అనేక చోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. యూపీలోని అలీగఢ్‌లో జరిగిన మహాపంచాయత్‌లో బీకేయూ నేత రాకేశ్‌ టికాయిత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అవసరమైతే రాష్ట్రపతి వద్దకు వెళ్తాం. మేం మీకు తోడుగా ఉన్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని రెజ్లర్లకు రాకేశ్‌ టికాయిత్‌ భరోసా ఇచ్చారు. పతకాలను గంగానదిలో కలపవద్దని.. వాటిని వేలానికి పెట్టాలని సూచించినట్లు తెలిపారు. అలా చేసినట్లయితే యావత్‌ ప్రపంచం ముందుకు వచ్చి వేలం వేయొద్దని మిమ్మల్ని కోరుతుందని రెజ్లర్లకు చెప్పినట్లు రాకేశ్‌ టికాయిత్‌ పేర్కొన్నారు. కుటుంబం పెద్దదైతే మంచిదనే ఉద్దేశంతోనే రెజ్లర్లకు మద్దతు ఇస్తున్నామన్న ఆయన.. అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోవద్దని రెజ్లర్లకు సూచించానని అన్నారు. మరోవైపు ముజఫర్‌నగర్‌లో జరిగిన ఖాప్‌ మహాపంచాయతీకి పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, దిల్లీ నుంచి రైతు నేతలు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)