ప్రాణం పోయేవరకు ఉరితీయండి : కర్ణాటక హైకోర్ట్ ధర్వార్డ్ బెంచ్

Telugu Lo Computer
0


అనుమానంతో తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురిని హత్య చేసిన వ్యక్తికి కర్ణాటక హైకోర్ట్ ధర్వార్డ్ బెంచ్ మరణశిక్ష విధించింది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు మరణాలకు దారితీసిన ఈ నేరాన్ని కౄరత్వంతో పోలుస్తూ అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించింది. బరువెక్కిన హృదయంతో ట్రయర్ కోర్టు విధించిన మరణశిక్షను ధృవీకరించడం తప్పితే మాకు మరో మార్గం లేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి సూరజ్ గోవిందరాజ్ మరియు జస్టిస్ జి బసవరాజా ధర్మాసనం, దీన్ని మరణశిక్ష విధించాల్సిన అరుదైన కేసుల్లో ఒకటిగా పేర్కొంది. నిందితుడి క్రూరత్వానికి దిగ్భ్రాంతికి గురైనట్లు హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు మరియు ముగ్గురు పిల్లలపై దాడి చేయడం, వారిని నరికివేయడం, రక్తంతో ఉన్న కత్తిని బయటకు తీసుకువచ్చి వేశ్యను చంపానని ప్రకటించడం, మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడిని మరణించే వరకు ఉరితీయాలని, అంతకుముందు బళ్లారి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి, ఉరి శిక్షను ధృవీకరించింది. బళ్లారిలోని హోసపేటలోని కంప్లిలోని కెంచనగుడ్డ హళ్లికి చెందిన నిందితుడు బైలూరు తిప్పయ్య అనే కూలీ తన భార్యకు 12 ఏళ్లుగా అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గొడవ పడుతుండే వాడు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఇందులో ఒకరు మాత్రమే తన సంతానం అని తిప్పయ్య ప్రకటించాడు. 2017 ఫిబ్రవరి 25న భార్య పక్కీరమ్మపై చాపర్‌తో దాడి చేశాడు. కోడలు గంగమ్మ, అతని పిల్లలు పవిత్ర, నాగరాజ్, రాజప్పపై కూడా దాడి చేశాడు. ఐదుగురు తీవ్ర గాయాలపాలై ప్రాణాలు విడిచారు. బళ్లారి సెషన్స్ కోర్టు 36 మంది సాక్షులను విచారించి తిప్పయ్యను దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పింది. ఆ తరువాత ఈ రోజు కర్ణాటక హైకోర్టు కూడా ఇదే తీర్పును వెలవరించింది. ఈ హత్యకాండలో ప్రాణాలతో బయటపడిన ఏకైక చిన్నారి రాజేశ్వరికి పరిహారం చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)