ప్రియాంకకు కాంగ్రెస్‌లో కీలక భూమిక ?

Telugu Lo Computer
0

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, అత్యంత కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందస్తు వ్యూహ రచన సాగిస్తోంది. ఇందులో భాగంగా ప్రియాంక గాంధీ వాద్రాకు పార్టీలో మరింత కీలక పాత్ర ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ ఉండగా, ఇందుకు ప్రత్యామ్నాయంగా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం పెద్దల ఆలోచనగా ఉందని తెలుస్తోంది. 2024 లోక్‌సభలో ప్రియాంక పోటీ చేస్తారా లేదా అనే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. త్వరలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. వీటితో పాటు రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం కోల్పోయిన కేరళలోని వయనాడ్‌లో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహకాలు చేస్తోంది. క్రిమినల్ పరువునష్టం కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు ఇటీవల రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో రాహుల్ తన ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ రెండు స్థానాల్లో పోటీ చేయగా, వయనాడ్‌ నుంచి గెలుపొందారు. అమేథి నుంచి పోటీ చేసి బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇటీవల వయనాడ్ లోక్‌సభ సభ్యత్వంపై వేటుపడటంతో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ సీటను ఎలాగైనా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ స్థానే ప్రియాంకను వయనాడ్ ఉపఎన్నికల బరిలోకి దింపుతారా? ఎకాఎకీన 2024 లోక్‌సభ ఎన్నికల బరిలోకే పంపుతారా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఏదిఏమైనప్పటికీ ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంకను కీలకంగా తెరపైకి తీసుకు వచ్చేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)