సికింద్రాబాద్‌-అగర్తల ఎక్స్‌ప్రెస్‌లో పొగలు !

Telugu Lo Computer
0


ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని 278 మంది దుర్మరణం చెందిన ఘోర ప్రమాదాన్ని మరవకముందే మరో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. సికింద్రాబాద్‌-అగర్తల ఎక్స్‌ప్రెస్‌ లోని ఓ బోగీలో పొగలు కమ్మేశాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్‌ - అగర్తల ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒడిశాలోని బరంపూర్ రైల్వే స్టేషన్‌లో ఆగినప్పుడు బి-5 ఏసీ కోచ్‌ నుంచి పొగలు  రావడం ప్రయాణికులు గుర్తించారు. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే బోగీ నుంచి దిగిపోయి రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. ఏసీలో మంటలు వచ్చినట్లు గుర్తించిన సిబ్బంది వాటిని ఆర్పివేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. అయితే, ఈ పరిణామంతో ప్రయాణికులు కంగారుపడ్డారు. కొందరు ప్రయాణికులు మళ్లీ బోగీ ఎక్కేందుకు నిరాకరించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో కొంతసేపు స్టేషన్‌లో నిలిచిన రైలు.. 45 నిమిషాల తర్వాత తిరిగి గమ్యస్థానానికి బయల్దేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)