గోవా వేదికగా జీ-20 టూరిజం మినిస్టర్స్ కాన్ఫరెన్స్‌ !

Telugu Lo Computer
0


జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ చివరి సమావేశాలతో పాటు జీ-20 టూరిజం మినిస్టర్స్ కాన్ఫరెన్స్‌కు గోవా వేదికైంది. దేశంలోనే గోవా అత్యుత్తమ పర్యాటక ప్రాంతమని, అద్భుత వారసత్వ సంపదకు, ప్రకృతి సౌందర్యానికి, ఎకో టూరిజంకు కేంద్రమని, అందుకే టూరిజం వర్కింగ్ గ్రూప్ చివరి సమావేశాలకు గోవాను ఎంపిక చేశామని కేంద్రం ప్రకటించింది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంతో పాటు, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడం కోసం చేపట్టాల్సిన చర్యలపై వర్కింగ్‌ గ్రూప్‌ చర్చించనుంది. జీ-20కి ఈ ఏడాది నాయకత్వం వహిస్తున్న భారతదేశం పర్యాటక విభాగంలో గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ అనే అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంది. 2030 వరకు నిర్దేశించుకున్న సుస్ధిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో ఈ అంశాలు కీలకంగా మారనున్నాయి. ముగింపు సమావేశంలో జీ-20 సభ్య దేశాలతో పాటు ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. టూరిజం వర్కింగ్ గ్రూప్ నిర్దేశించుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో గోవా రోడ్ మ్యాప్ కీలకం కానుంది. క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించే వ్యూహాలపై దృష్టి పెట్టినట్టు పర్యాటక శాఖ కార్యదర్శి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ టూరిజం అభివృద్ధిలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై ఈ కాన్ఫరెన్స్‌లో చర్చిస్తామన్నారు. 'మేకింగ్ ఇండియా ఏ క్రూయిజ్ టూరిజం హబ్' అంశంపై జాతీయ స్థాయిలో సైడ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు చెప్పారు. క్రూయిస్ టూరిజంలో భాగంగా కోస్టల్, ఐలాండ్, రీజినల్, తీర రాష్ట్రాలు, లోతట్టు జలమార్గాలలో ప్రైవేట్ - పబ్లిక్ వాటాదారులు, నదీతీర రాష్ట్రాల దృక్పథాలపై చర్చించనున్నారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంతో పాటు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి చెప్పారు. జూన్ 21న 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' సందర్భంగా గోవా రాష్ట్ర ప్రభుత్వం జీ-20 సమావేశాలతో సమాంతరంగా ప్రత్యేక యోగా సెషన్ ఏర్పాటు చేసింది. గోవాలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందిన ప్రాంతాల్లో విహారయాత్రలు నిర్వహించనున్నారు. బసిలికా ఆఫ్ బోమ్ జీసస్, చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి, సే కేథడ్రల్, అగ్వాడా ఫోర్ట్ లాంటి ప్రాంతాలకు జీ-20 ప్రతినిధులకు తీసుకెళ్లనున్నట్లు అధికారులు వెల్లడించారు. టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాల సందర్భంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బజార్లను నిర్వహిస్తోంది ప్రభుత్వం. జూన్ 20న జరగనున్న ప్రధాన కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. సమావేశాల్లో భాగంగా కథక్, గోవా మాండో మ్యూజిక్ అండ్ డాన్స్, దే గోమంత్ రంగ్ వంటి గోవా కళారూపాలను ప్రదర్శించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)