పార్లమెంట్ సభ్యత్వం కేవలం ట్యాగ్ మాత్రమే !

Telugu Lo Computer
0


పార్లమెంట్ సభ్యత్వం తనకు కేవలం ట్యాగ్ మాత్రమేనని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ అన్నారు. కొద్ది రోజుల క్రితం అనర్హత వేటు ఎదుర్కొన్న ఆయన, మంగళవారం తన సొంత నియోజకవర్గమైన వయనాడ్ ‭లో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వయనాడ్ ప్రజల నుంచి తనను వేరు చేయలేరని అన్నారు. తాను ప్రజల తరపున పార్లమెంటులో మాట్లాడడానికి ప్రయత్నించానని, కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు భయపడి తన మీద అనర్హత వేటు వేసిందని అన్నారు. ''ఎంపీ అనేది నాకు కేవలం ట్యాగ్ మాత్రమే. బీజేపీ ట్యాగును తీసుకోవచ్చు. నా పదవి, నా ఇల్లు తీసుకోవచ్చు. నన్ను జైల్లో కూడా వేయొచ్చు. కానీ వయనాడ్ ప్రజల నుంచి మాత్రం నన్ను ఎప్పటికీ దూరం చేయలేరు'' అని అన్నారు. ఇక పార్లమెంటు సమావేశాల్లో తనను మాట్లాడనివ్వడం లేదని కొద్ది రోజులుగా చెప్తున్న ఆయన.. ఆ విషయమై స్పందిస్తూ ''బీజేపీ మంత్రులు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి నన్ను పార్లమెంటులో మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు మొత్తమే మాట్లాడకుండా నా సభ్యత్వం రద్దు చేశారు. మళ్లీ వాళ్లే నేను మాట్లాడటం లేదని ఫిర్యాదు చేస్తున్నారు'' అని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ ర్యాలీలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సహా కర్ణాటక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తనపై అనర్హత వేటు పడ్డ అనంతరం రాహుల్ మోదటిసారి వయనాడ్ వచ్చారు. ఇక ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ''రాహుల్ గాంధీ ప్రశ్నలకు బీజేపీ దగ్గర సమాధానాలు లేవు. అందుకే రాహుల్ మీద అనర్హత వేటు వేశారు. గౌతమ్ అదానీని కాపాడేందుకే రాహుల్ ను బయటకు పంపారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ధ్వంసం చేస్తోంది. ప్రధాని రోజూ బట్టలు మారుస్తారు. కానీ దేశంలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయారు'' అని విమర్శలు గుప్పించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)