తెలంగాణలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం

Telugu Lo Computer
0


తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిదిన్నరకు పరీక్ష ప్రారంభం కాగా, 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పరీక్షకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. 6 పేపర్లతో పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 652 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల 456 పాఠశాలలకు చెందిన 4 లక్షల 94 వేల 620 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారిలో 2 లక్షల 43 వేల 852 బాలురు కాగా.. 2 లక్షల 41 వేల 974 మంది బాలికలు ఉన్నారు. ఆంగ్ల మాధ్యమంలో 3 లక్షల 78 వేల 794 మంది రాస్తుండగా.. తెలుగులో 98 వేల 726 మంది.. ఉర్దూలో 7,851, హిందీలో 235, మరాఠీలో 137, కన్నడలో 83 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 652 కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తారు. సైన్స్‌ పరీక్ష రోజున భౌతిక, జీవశాస్త్రం ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాలు వేర్వేరుగా ఇస్తారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా.. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఐదు నిమిషాల గ్రేస్ సమయంతో కలిపి.. అంటే 9 గంటల 35 నిమిషాల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుంది. సైన్స్, ప్రథమ భాష కాంపోజిట్ కోర్సు పరీక్షకు మాత్రం 20 నిమిషాల అదనపు సమయంతో కలిపి 12 గంటల 50 నిమిషాల వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 652 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2 వేల 652 డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లు, 34 వేల 500 మంది ఇన్విజిలేటర్లు, 144 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. పరీక్ష కేంద్రాల్లోకి సిబ్బంది మొబైల్ ఫోన్లు తీసుకెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షలపై ఇటీవలే సమీక్షించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి... ఎండ తీవ్రత పెరుగుతున్నందున పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో.. విద్యుత్ ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చునని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)