ఆరు నెలల నుంచి వేధిస్తున్నాడు !

Telugu Lo Computer
0


అసోం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు అంగ్‌కితా దత్తా ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ యూత్ వింగ్ (ఐవైసీ) జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ తనని ఆరు నెలల నుంచి వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. ఏం మందు తాగుతావ్? వొడ్కానా, టకీలానా? అంటూ ఆయన తనకు సందేశాలు పంపాడని చెప్పింది. యూత్ కాంగ్రెస్ అసోం కార్యదర్శి వర్ధన్ యాదవ్‌ ద్వారా కూడా ఆయన తనని అవమానించేవారని, తన గురించి చులకనగా మాట్లాడేవారని పేర్కొంది. వర్ధన్‌కు అవినీతి చరిత్ర ఉందని, ఒక కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చాడని, అయినా అతనికి ఆ పదవి ఎలా ఇచ్చారో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. వర్ధన్ తనతో అమర్యాదగా ప్రవర్తించిన విషయాన్ని బీవీ శ్రీనివాస్‌కు చెప్తే, వర్ధన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, బీవీ శ్రీనివాస్ సైతం తనకు అభ్యంతరకర సందేశాలు పంపడం మొదలుపెట్టారని అంగ్‌కితా చెప్పింది. రాను రాను బీవీ శ్రీనివాస్ వేధింపులు ఎక్కువ అవుతుండటంతో ఆయన గురించి భారత్‌ జోడో యాత్రలో రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లానని తెలిపింది. అయితే అప్పటి నుంచి శ్రీనివాస్ వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయని ఆమె చెప్పుకొచ్చింది. రాహుల్ గాంధీపై నమ్మకంతో తాను బీవీ శ్రీనివాస్ బాగోతాన్ని ఆయనకు చెప్పానని, ఇన్నిరోజులైనా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. మహిళల సంరక్షణ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, బీవీ శ్రీనివాస్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఒక మహిళా నేత అయిన తనకే ఇలాంటి వేధింపులు ఎదురవుతున్నప్పుడు, మహిళల్ని కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ తానెలా చెప్పగలనని నిలదీసింది. తాను చాలా శక్తివంతుడినని బీవీ శ్రీనివాస్ అనుకుంటున్నారని,  పెద్ద పెద్ద నాయకుల ఆశీస్సులు ఉన్నాయని భావించి, పార్టీలోని ఒక మహిళను వేధిస్తే తననెవరూ అడ్డుకోలేరన్న ఉద్దేశంలో ఉన్నాడని అంగ్‌కితా పేర్కొంది. మునుపటి ఐవైసీ  ప్రెసిడెంట్ కేశవ్ కుమార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు అతడ్ని పదవి నుంచి తొలగించారని గుర్తు చేసింది. కానీ ఇప్పుడు శ్రీనివాస్ ఆరు నెలలుగా మానసికంగా వేధిస్తున్నా, వివక్ష చూపుతున్నా, తననే మౌనంగా ఉండమని చెప్తున్నారే తప్ప ఆయనపై ఎలాంటి విచారణ ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీనివాస్‌పై చర్యలు తీసుకుంటారని తాను నెలల తరబడి మౌనంగా ఉన్నానని, అయినప్పటికీ ఎవరూ చర్యలు తీసుకోలేదని చెప్పింది. పిఆర్‌ఓ ముసుగులో ఆయన ఎన్నో తప్పుడు పనులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. అయితే అంగ్‌కితా చేసిన ఆరోపణలను కాంగ్రెస్ యూత్ వింగ్ ఖండించింది. ఆమె బీజేపీతో టచ్‌లో ఉందని, వాళ్ల ఆదేశాల మేరకే ఆమె ఇలాంటి ఆరోపణలు చేసిందని కాంగ్రెస్ యూత్ వింగ్ చెప్తోంది. కానీ తన ఆరోపణలు తప్పు కావని, విచారణకు రావడానికి కూడా తాను సిద్ధమేనని అంగ్‌కితా సవాల్ చేసింది. తన వద్ద బీవీ శ్రీనివాస్ పంపిన మెసేజ్‌లు కూడా ఉన్నాయంది. అలాగే తాను సీఎం హిమంత బిశ్వ శర్మను కలిసినట్లు అంగీకరించిన ఆమె కేవలం ఓ మెంటల్ హెల్త్‌ కేర్‌ ప్రాజెక్టు కోసమే ఆయనతో సమావేశమైనట్లు తెలిపారు. దీన్ని అడ్డం పెట్టుకొని  బీవీ శ్రీనివాస్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)