ఇన్‌ఫ్లియేషన్‌ రిలీఫ్‌ క్యాంప్‌లను ప్రారంభించిన అశోక్‌ గెహ్లాట్‌

Telugu Lo Computer
0


రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆ రాష్ట్ర ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు 'ఇన్‌ఫ్లియేషన్‌ రిలీఫ్‌ క్యాంప్‌'లను ప్రారంభించారు. ఈ క్యాంపుల ద్వారా ప్రజలకు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగేలా చర్యలు చేపడుతున్నట్లు గెహ్లాట్‌ వెల్లడించారు. సోమవారం జైపూర్‌లోని మహపురా గ్రామంలో గెహ్లాట్‌ ఈ ద్రవ్యోల్బణ ఉపశమన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'రాష్ట్రంలోని రైతులకు రెండు వేల యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించనున్నాం. దీంతో రైతుల కరెంట్‌ బిల్లు జీరో రానుంది. అలాగే రాష్ట్ర ప్రజలకు రూ.1000 పెన్షన్‌ ఇవ్వనున్నాం. లంపి వ్యాధివల్ల మృతి చెందిన పశువులకు రూ.40,000 ఆర్థిక సహాయం అందజేశాం' అని ఆయన అన్నారు. ఈ ద్రవ్యోల్బణ ఉపశమన శిబిరాల ద్వారా సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గెహ్లాట్‌ అన్నారు. కాగా ఈ ద్రవ్యోల్బణ శిబిరాలపై ఆదివారం మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి 30 వరకు నిర్వహించనున్న ఈ శిబిరాలను సామాన్యులు తప్పక ఉపయోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పది ప్రజా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ప్రయోజనం పొందుతారు. సామాన్య ప్రజలకు ఈ పథకాలు లబ్ధి చేకూరాలంటే తప్పనిసరిగా వారి అర్హతల గురించి సమాచారాన్ని నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజల సౌకర్యార్థం ఏ జిల్లాకు చెందిన వారైనా.. ఇతర జిల్లాల్లోని శిబిరాల్లో జనాధర్‌ ద్వారా సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చని గెహ్లాట్‌ అన్నారు. ముఖ్యంగా నిరుపేదలెవరూ సమాచారాన్ని నమోదు చేయకుండా ఉండకూడదని ఆయన ఆదేశించారు. వారం రోజుల్లో ప్రతిరోజూ 2,700 ద్రవ్యోల్బణ ఉపశమన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)