రాహుల్‌ గాంధీకి బెయిల్‌ మంజూరు !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో ఊరట లభించింది. సోమవారం సూరత్‌ సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే కింది కోర్టు తనకు విధించిన జైలు శిక్ష తీర్పుపై మధ్యంతర స్టే విధించాలని రాహుల్‌ చేసిన అభ్యర్థనపై ఇప్పుడే తీర్పు చెప్పలేమని వెల్లడించింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్‌ 13కు వాయిదా వేసింది. మోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు గానూ రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల సూరత్‌ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై ఈ రోజు ఆయన గుజరాత్‌లోని సూరత్‌ డిస్ట్రిక్‌ అండ్ సెషన్స్ కోర్టులో అప్పీల్‌ చేసుకున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు, సోదరి ప్రియాంకా గాంధీ వెంట రాగా.. ఆయన సూరత్‌ సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. భారీ భద్రత నడుమ అక్కడకు చేరుకున్నారు. తన జైలుశిక్ష తీర్పును సవాలు చేశారు. ఈ తీర్పుపై అప్పీల్ చేసిన ఆయన మరో రెండు అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ కేసులో తనను దోషిగా తేల్చడంపై స్టే విధించాలని, జైలుశిక్షను సస్పెండ్‌ చేయాలని అందులో కోరారు. అయితే, అవతలి పక్షం వాదనలు వినకుండా అలాంటి ఆదేశాలు ఇవ్వడం వీలుకాదని కోర్టు వెల్లడించింది. అలాగే పరువునష్టం కేసులో ప్రతివాదులు ఏప్రిల్‌ 10లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏప్రిల్‌ 13వ తేదీన విచారణ చేపడుతామని స్పష్టం చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)