ఎలుకను చంపినందుకు కేసు !

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ లోని బదౌన్ ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ 2022 నవంబర్ 25న ఓ ఎలుకను పట్టుకొని చిత్రహింసలు పెట్టాడు. దాని తోకకు తాడుతో ఇటుకను కట్టి మురికి కాలువలో వదిలిపెట్టారు. యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ అయిన వికేంద్ర శర్మ అనే వ్యక్తి ఈ మొత్తం ఘటనను సెల్ ఫోల్ లో రికార్డు చేశాడు. వెంటనే కాలువలోకి దిగి ఆ ఎలుకను బయటకు తీశాడు. అయితే ఊపిరాడకపోవడంతో అప్పటికే ఆ ఎలుక చనిపోయింది. దీంతో వికేంద్ర శర్మ నిందితుడు మనోజ్ కుమార్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ప్రూఫ్ గా తాను రికార్డు చేసిన వీడియోను చూపించాడు. వికేంద్ర కంప్లైంట్ తో పోలీసులు ఎలుక కళేబరాన్ని పోస్టుమార్టం కోసం బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు పంపారు. నిందితుడిపై జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని సెక్షన్ 11, ఐపీసీ సెక్షన్ 429 కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఎలుకను చంపిన మనోజ్ ఘటన జరిగిన ఐదు రోజులకు సరెండర్ అయ్యాడు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరచగా జడ్జి బెయిల్ మంజూరు చేశారు. నిందితుడి కారణంగా ఎలుక లివర్, లంగ్స్ డ్యామేజ్ అయ్యాయని, ఊపిరాడకపోవడంతో అది చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. పోస్టుమార్టం రిపోర్టు, వీడియో ఆధారంగా పోలీసులు 30 పేజీల ఛార్జ్ షీట్ సిద్ధం చేశారు. దాన్ని స్థానిక కోర్టులో సమర్పించారు. నేరం రుజువైతే జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం నిందితుడికి రూ.10 నుంచి రూ.2000 వరకు ఫైన్, మూడేళ్ల జైలుశిక్ష, ఐపీసీ సెక్షన్ 429 ప్రకారం జరిమానాతో పాటు ఐదేళ్ల శిక్ష పడే అవకాశముందని న్యాయ నిపుణులు చెబుతున్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)