తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజుల పాటు వడగండ్ల వానలు !

Telugu Lo Computer
0


తెలంగాణలో బుధవారం నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి సోమవారం బలపడడంతో..గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఓవైపు వర్షంతో పాటు పలు జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలూ ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వాన, 17న ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. శనివారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, కుమ్రంభీం, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)