వేరుశనగ - అలర్జీలు !

Telugu Lo Computer
0


బ్రిటన్‌కు చెందిన ఇద్దరు టీనేజర్లు వేరుశనగ పుప్పు, నువ్వులు తిని అలర్జీ పాలై చివరకు మృతిచెందడం ఆందోళన కలిగించింది. పశ్చిమ ఆస్ట్రేలియాలో గత ఆగస్టులో ఆరేళ్ల బాలిక పాల ఉత్పత్తులు ఆరగించి అలర్జీ పాలై చివరకు ప్రాణాలు కోల్పోయింది. పశ్చిమదేశాల్లో ఈ విధమైన అలర్జీలు ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమ దేశాల్లో గత దశాబ్ద కాలంలో వేరుశెనగ తినడం వల్ల వచ్చే అలర్జీ రెట్టింపు స్థాయిలో పెరిగింది. బ్రిటన్‌లో ప్రతి 50 మంది పిల్లల్లో ఒకరికి ఈ వేరుశెనగ అలర్జీ పీడిస్తోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించాల్సిందే. ఈ రిస్కు తగ్గించడం కోసం వైద్య నిపుణులు సతమతమవుతున్నారు. పరిశోధనలు సాగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో నాలుగు నుంచి ఆరు నెలల వయసు ఉన్న పసిపిల్లల్లో వేరుశనగ పదార్ధాలు తినిపించడం అలవాటు చేయడం అవసరమని, దానివల్ల వేరుశనగ నుంచి వచ్చే అలర్జీ రిస్కు 77 శాతం వరకు తగ్గుతుందని బయటపడింది. పశ్చిమ దేశాల్లో ఏటా 10,000 మంది పిల్లలు వేరుశెనగ అలర్జీ పీడితులవుతున్నారు. ఈ దేశాల్లో పిల్లలకు వేరుశెనగ పదార్ధాలు, స్నాక్స్, పీనట్ బటర్ వంటివి ఇవ్వడానికి తల్లిదండ్రులు ఒప్పుకునేవారు కారు. కానీ ఇప్పుడు వాటిని చిన్నవయసు నుంచే తినిపించవలసి వస్తుంది. 6 నుంచి 12 నెలల వయసు పిల్లల్లో వేరుశెనగ అలర్జీ కనిపిస్తోందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా తామర వంటి దురదతో కూడిన చర్మవ్యాధి ఉన్న పిల్లలకు, మైనార్జీ జాతుల పిల్లలకు ఈ అలర్జీ ఎక్కువగా వస్తోందని చెబుతున్నారు. శరీరంలో ఎక్కడ తామర వ్యాధి కనిపిస్తుందో అక్కడ చర్మం ఎర్రగా, దురదగా, ఎండిపోయినట్టు ఉంటుంది. దీన్ని ఎటోపిక్ డెర్మటైటిస్ అంటారు. సాధారణంగా చిన్నతనం నుంచి ఇది సంక్రమిస్తుంటుంది. జీవితాంతం కొనసాగుతుంది. కుటుంబ చరిత్రలో ఎటోపీ ఉన్న వ్యక్తుల్లో ఇది కనిపిస్తుంది. దుమ్ము, పుప్పొడి, అత్తరు వంటి సుగంధ ద్రవ్యాలు నుంచే కాక, సముద్ర ఆహార ఉత్పత్తులు,వేరుశనగ వంటి గింజలు, కూరగాయల నుంచి కూడా తామర పెరగడానికి కారణమవుతుందని చెబుతున్నారు. అందువల్ల తామర ఉన్న పిల్లల్లో నాలుగు నెలల వయసు నుంచే వేరుశెనగ ఉత్పత్తులు తినిపించాలని, తామర వ్యాధి లేని పిల్లల్లో ఆరునెలల నుంచి వేరుశనగ తినిపించాలని పరిశోధకులు ప్రయోగాత్మకంగా ఉదహరిస్తున్నారు. పిల్లలకు తల్లులు చనుబాలు ఏ విధంగా ఇస్తుంటారో, అలాగే గట్టి పదార్ధాలను కూడా పిల్లలకు తినిపించడం అలవాటు చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. టీస్పూన్ అంత పీనట్ బటర్ వారానికి మూడు సార్లు ఇస్తుండాలని చెబుతున్నారు. పీనట్ పఫ్స్ వంటివి బాగా మెత్తగా పొడిచేసి పిల్లలకు ఇవ్వాలని చెబుతున్నారు. అయితే ప్రభుత్వాలు ఈ వేరుశనగ పదార్ధాల వల్ల అలర్జీ తగ్గుతుందని ఇంకా నిర్ధారణ కావడానికి మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)