వన్డే ప్రపంచకప్‌-2023 క్వాలిఫియర్స్‌లో నేపాల్‌ విజయం

Telugu Lo Computer
0


వన్డే ప్రపంచకప్‌-2023 క్వాలిఫియర్స్‌ ఆశలను నేపాల్‌ జట్టు సజీవంగా నిలుపుకుంది. ఐసీసీ వరల్డ్‌ కప్‌ లీగ్‌-2లో భాగంగా యూఏఈతో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో నేపాల్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. నేపాల్‌ బ్యాటర్లలో భీమ్ షార్కి (70), ఆరిఫ్ షేక్ (43) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో జూనైడ్‌ సిద్దూఖి మూడు వికెట్లు, ముస్తఫా, లాక్రా తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. 45 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లో ఆసిఫ్‌ ఖాన్‌(82), ఆర్యన్ లాక్రా(50) పరుగులతో రాణించనప్పటికీ.. ఓటమి మాత్రం యూఏఈ వెంట నిలిచింది. ఇక నేపాల్‌ బౌలర్లలో దీపేంద్ర సింగ్, కామి తలా మూడు వికెట్లతో యుఏఈ పతనాన్ని శాసించారు. నేపాల్‌ విజయంలో ఆ జట్టు స్పిన్నర్‌ దీపేంద్ర సింగ్ కీలక పాత్ర పోషించాడు. 8 ఓవర్లు బౌలింగ్‌ చేసిన దీపేంద్ర సింగ్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ ఓ స్పెషల్‌ సెలబ్రేషన్స్‌తో అందరని ఆశ్చర్యపరిచాడు. యూఏఈ ఇన్నింగ్స్‌ 42 ఓవర్‌ వేసిన దీపేంద్ర.. అద్భుతంగా ఆడుతున్న ఆసిఫ్‌ ఖాన్‌ను రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. దీంతో నేపాల్‌ జట్టు సంబరాల్లో మునిగి తేలిపోయింది. దీపేంద్ర సింగ్ అయితే గ్రౌండ్‌లో పై ఫ్లిప్స్ (గెంతులు) వేసి వికెట్‌ సెల్‌బ్రేషన్స్‌ జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో​ వైరల్‌గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)