సౌతాఫ్రికా-వెస్టిండీస్‌ ఆటలో ఒక్క రోజే 16 వికెట్లు

Telugu Lo Computer
0


దక్షిణాఫ్రికా  లోని  సెంచూరియన్‌ వేదికగా సౌతాఫ్రికా-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుంది. రెండో రోజు ఏకంగా 16 వికెట్లు నేలకూలడం, ఈ వికెట్లన్నీ ఇరు జట్ల పేసర్ల ఖాతాలోకే వెళ్లడంతో ఆట మరింత రసపట్టుగా మారింది. 314/8 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిధ్య సౌతాఫ్రికా మరో 28 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. సఫారీల ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ (115) సెంచరీతో కదం తొక్కగా.. డీన్‌ ఎల్గర్‌ (71) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌ 5 వికెట్లు నేలకూల్చగా.. రోచ్‌, మేయర్స్‌, గాబ్రియెల్‌, హోల్డర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌.. నోర్జే (5/36), రబాడ (2/44), కోయెట్జీ (2/45), జన్సెన్‌ (1/64) ధాటికి 212 పరుగులకే ఆలౌటైంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో రీఫర్‌ (62) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 130 పరుగుల లీడ్‌తో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సఫారీ టీమ్‌.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 49 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో మార్క్రమ్‌ (35 నాటౌట్‌) నిలకడగా ఆడుతుండగా.. మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌ పరుగులకే పరిమితమయ్యారు. విం‍డీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌ 2, రోచ్‌, హోల్డర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 179 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)