జోరుగా సాగుతున్న అక్రమ మందుల వ్యాపారం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో బయటపడ్డ వందలాది అబార్షన్‌ కిట్లు జిల్లాలో యథేచ్ఛగా సాగుతోన్న దొంగ మందుల వ్యాపారం గుట్టురట్టు చేసింది. రహదారి పక్కన పొలంలో ఒకటో రెండో కాదు, ఏకంగా 850 అబార్షన్‌ కిట్లు బయటపడటం కలకలం రేపుతోంది. వీటి విలువ అక్షరాలా 4 లక్షలు. ఇదే ఇప్పుడు స్థానికంగా హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే తేతిలిలో తీగలాగితే కర్నాటకలో డొంక కదిలింది. ఇన్నాళ్ళూ ఎక్కడినుంచి వస్తున్నాయో అర్థంగాక తికమకపడుతోన్న అధికారులకు నిషేధిత మందుల సప్లై వేళ్ళు కర్నాటకలో ఉన్నట్టు రూఢీ అయ్యింది. దీంతో తణుకు భీమవరం మండలాల్లో ఐదు షాపులు గొడౌన్లు పై దాడులు చేసి 21 లక్షలు విలువ చేసే నిషేధిత మందులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారం దందాలో కీలక సూత్రధారి కె.శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. మొన్నటికి మొన్న ఐదు మెడికల్‌ షాపులపై దాడులు చేశారు అధికారులు 16 లక్షల విలువచేసే అక్రమ మందులు సీజ్‌… ఏడాది కాలంలో 9 మెడికల్‌ అక్రమ దందా కేసులు. పాతిక లక్షల విలువైన మందులు సీజ్‌…ఇదొక్కటి చాలు పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతోన్న మెడికల్‌ మాఫియా దందా అర్థం చేసుకోవడానికి. ఈ అక్రమ మందుల దందాలో ఆర్‌ఎంపీలూ, పీఎంపీల పాత్ర కీలకమని తేలింది. పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొస్తోన్న మందులు, అబార్షన్‌ కిట్లపై బ్యాచ్‌ నెంబర్లు, ఎంఆర్‌పీ ధరలను శానిటైజర్‌తో తుడిచేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తణుకులోని వెంకటసాయి మెడికల్‌ స్టోర్‌లో నిషేధిత మందుల విక్రయం జోరుగా సాగుతోంది. అయితే ఒక్క మెడికల్‌ షాపులే కాదు…కిరాణా షాపుల్లో సైతం అక్రమ మందుల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్‌, విజయవాడ, బెంగుళూరు ప్రాంతాల్లోని మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ ద్వారా మందులు దిగుమతి చేసుకొని, అక్రమంగా నిలవచేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. గత నెలలో సైతం పాలకొల్లులో అక్రమ మందుల దందా నిర్వహిస్తోన్న ఆర్‌ఎంపీపై దాడిచేసిన పోలీసులు పెద్దమొత్తంలో అక్రమ మందులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇప్పుడు కర్నాటక మూలాలు వెలికితీసేందుకు సంసిద్ధమౌతున్నారు జిల్లా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు.

Post a Comment

0Comments

Post a Comment (0)