బీటలువారుతున్న జోషిమఠ్‌

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ నగరంలో కొంతకాలంగా ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టి, బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందుతున్నారు. బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందడానికి వీల్లేని వారు తమ ఇంటి బయట బహిరంగ ప్రదేశంలోనే నిద్రిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి ఇళ్లు బీటలు వారుతున్నాయి. రోడ్లు నిలువునా చీలిపోతున్నాయి. ఆ చీలకలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఒక ఆలయం కూలిపోయిందని ఎన్‌డీటీవీ తెలిపింది. దాదాపు 600 ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పింది. ప్రజలను తాత్కాలికంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు. ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ విపత్తు నిర్వహణ దళాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. స్థానిక ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వంపై చాలా కోపంగా ఉన్నారు. గురువారం ఉదయం ఇక్కడి సాధారణ పౌరులు బద్రీనాథ్ హైవేను దిగ్బంధించారు. సాయంత్రం పూట మండుతున్న కాగడాలతో నిరసన ప్రదర్శనలు చేశారు. గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల తర్వాత నుంచి క్రమక్రమంగా ఇంటికి పగుళ్లు రావడం మొదలైంది. దీనిపై జోషీమఠ్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ అభిషేక్ త్రిపాఠి మాట్లాడుతూ, ''గురువారం నాలుగు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. అన్ని రకాల నిర్మాణ పనులను నిలిపి వేశాం. దెబ్బతిన్న ఇళ్ల నుంచి ఇప్పటివరకు 38 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు పంపించాం'' అని చెప్పారు. జోషిమఠ్ కుటుంబాలు నివసించేందుకు రెండు వేల ప్రి-ఫ్యాబ్రికేటెడ్ భవనాలను నిర్మించాలని ఎన్టీపీసీ, హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ సంస్థలను జిల్లా యంత్రాంగం కోరింది. జోషిమఠ్ బచావో సంఘర్ష్ సమితి కన్వీనర్ అతుల్ సతీ ఈ అంశంపై మాట్లాడుతూ, ''మేం భూస్థాపితం అయ్యే పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభుత్వం ఇప్పుడు నిర్మాణ పనులను ఎందుకు నిలిపివేసింది? ముందుగా మా గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?'' అని ఆయన ప్రశ్నించారు.




Post a Comment

0Comments

Post a Comment (0)