బీజేపీ మాజీ కార్పొరేటర్‌ కుటుంబం ఆత్మహత్య !

Telugu Lo Computer
0


మధ్య ప్రదేశ్‌లోని విదీషాకు చెందిన 45 ఏళ్ల సంజీవ్ మిశ్రా బీజేపీ మాజీ కార్పొరేటర్‌. వారి ఇద్దరు కుమారులైన 13 ఏళ్ల అన్మోల్‌, 7 ఏళ్ల సార్థక్‌ కండరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుమారుల అనారోగ్యం గురించి కొంతకాలంగా భార్యాభర్తలు కలత చెందుతున్నారు. దీంతో సంజీవ్‌ మిశ్రా, 42 ఏళ్ల భార్య నీలం ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. తొలుత తమ పిల్లలిద్దరిని చంపి, అనంతరం ఆ దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనకు ముందు సంజీవ్‌ మిశ్రా ట్విట్టర్‌లో ఒక ట్వీట్‌ చేశాడు. 'శత్రువుల పిల్లలకైనా ఈ వ్యాధి రాకుండా దేవుడు చూడాలి. నా పిల్లలను నేను కాపాడుకోలేను. ఇక నేను జీవించాలనుకోవడంలేదు' అని అందులో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌ చూసిన కొందరు పోలీసులను అలెర్ట్‌ చేశారు. దీంతో విదీషా సివిల్‌ లైన్స్‌ పోలీసులు వెంటనే సంజీవ్‌ మిశ్రా ఇంటికి చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న సంజీవ్‌ మిశ్రా, ఆయన భార్య, ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ నలుగురు చనిపోయారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)