దంపతులకు పోలీసుల వేధింపు !

Telugu Lo Computer
0


బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్‌ సమీపంలోని హౌసింగ్‌ సొసైటీలో నివసించే కార్తీక్ పత్రి, తన భార్యతో కలిసి సమీపంలోని స్నేహితుడి ఇంటికి బర్త్‌ డే వేడుక కోసం వెళ్లారు. అనంతరం అర్థరాత్రి 12.30 గంటలకు నడుచుకుంటూ తమ ఇంటికి వస్తున్నారు. ఇంతలో నైట్‌ పెట్రోలింగ్‌ పోలీస్‌ వాహనం వారి వద్దకు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు పోలీసులు ఆ దంపతులను వేధించారు. వారి ఆధార్‌ కార్డులు చూపాలని అడిగారు. మొబైల్‌లో వాటిని చూపించగా సెల్‌ ఫోన్లను లాక్కొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత రోడ్డుపై ఉన్నందుకు రూ.3,000 జరిమానా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీంతో దంపతులు షాక్‌ అయ్యారు. తమకు ఈ విషయం తెలియదని, క్షమించి వదిలిపెట్టాలని వేడుకున్నారు. అయితే జరిమానా చెల్లించకపోతే అరెస్ట్‌ చేయాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఇలాంటి సంఘటనను ఎప్పుడూ ఎదుర్కోని కార్తీక్‌ భార్య కన్నీటి పర్యంతమైంది. అంతలో ఒక పోలీస్‌ కార్తీక్‌ను పక్కకు తీసుకెళ్లాడు. ఎంతో కొంత చెల్లించి ఈ ఇబ్బంది నుంచి బయటపడాలని చెప్పాడు. దీంతో చేసేదేమీలేక రూ.1000 చెల్లించేందుకు కార్తిక్‌ ఒప్పుకున్నాడు. ఆ పోలీస్‌ వెంటనే పేటీఎం క్యూఆర్‌ స్కాన్‌ను చూపించగా కార్తీక్‌ దాని ద్వారా ఆ డబ్బులు చెల్లించాడు. దీంతో ఆ జంటను పోలీసులు వదిలిపెట్టారు. కార్తీక్‌ ఈ సంఘటన గురించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. తమ జంట ఎదుర్కొన్న భయానక అనుభవంపై 15 వరుస ట్వీట్లలో ఆవేదన వ్యక్తం చేశాడు. బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌కు దీనిని ట్యాగ్‌ చేసి సహాయం కోరాడు. ఈ నేపథ్యంలో బెంగళూరు సిటీ ఈశాన్య విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్‌ పోలీస్‌ అనూప్ దీనిపై స్పందించారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తెచ్చిన కార్తీక్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆ దంపతులను వేధింపులకు గురి చేసిన పోలీస్‌ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఇబ్బంది ఇంకా ఎవరైనా ఎదుర్కొని ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. సంపిగేహళ్లి పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)