అత్యంత ఖరీదైన నగరాలు - అత్యంత చౌకైన నగరాలు !

Telugu Lo Computer
0


'ది ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్' వార్షిక సర్వే ప్రకారం ప్రపంచంలో జీవించడానికి అత్యధికంగా ఖర్చు చేయాల్సిన నగరాల జాబితాలో న్యూయార్క్, సింగపూర్ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాయి. 172 దేశాలతో కూడిన ఈ జాబితాలో న్యూయార్క్‌కు మొదటిసారి తొలి ర్యాంకు లభించింది. గతేడాది నంబర్‌వన్‌గా నిలిచిన టెల్ అవీవ్ ఈ ఏడాది మూడో స్థానానికి పడిపోయింది. మరోవైపు భారత్‌లోని అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు జీవన వ్యయంలో అత్యంత చౌక అయిన నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో బెంగళూరు 161వ ర్యాంకులో, చెన్నై 164వ ర్యాంకులో, అహ్మదాబాద్ 165వ ర్యాంకులో నిలిచింది. సర్వే నివేదికల ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో ఈ ఏడాది జీవన వ్యయం సగటు 8.1 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో యుద్ధం, సరఫరా వ్యవస్థలపై కరోనా ప్రభావం కూడా జీవన వ్యయం పెరుగుదలకు కారణాలుగా గుర్తించారు. ముఖ్యంగా ఇస్తాంబుల్‌లో ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. అక్కడ ధరల పెరుగుదల 86 శాతంగా నమోదైంది. బ్యూనస్ ఎయిర్స్‌లో 64 శాతం, టెహ్రాన్‌లో 57 శాతంగా ధరల పెరుగుదల ఉంది. ఖరీదైన నగరాల జాబితాలో న్యూయార్క్ అగ్రస్థానంలో నిలవడానికి డాలర్ బలపడటంతో పాటు అమెరికాలోని అధిక ద్రవ్యోల్బణం కూడా ఒక కారణం.టాప్-10లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో ద్రవ్యోల్బణం దేశంలో గత 40 సంవత్సరాల గరిష్టానికి చేరింది. మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరాలు కూడా ఈ ఏడాది ర్యాంకుల్లో పైకి ఎగబాకాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)