నన్ను అవమానించడానికి కాంగ్రెస్‌లో పోటీ పడుతున్నారు !

Telugu Lo Computer
0


గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం కలోల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ   శ్రీరాముని భక్తులు ఉన్న గడ్డలో ఓ వ్యక్తిని రావణుడని అభివర్ణించడం సరికాదన్నారు. తనను అవమానించేందుకు కాంగ్రెస్‌లో పోటాపోటీ పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  ఇటీవల మోదీని ఉద్దేశించి 'రావణుడు' వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ, మోదీ కుక్క చావు చస్తారని అన్నారని గుర్తు చేశారు. నియంత హిట్లర్ మాదిరిగా మోదీ చచ్చిపోతారని మరొక కాంగ్రెస్ నేత అన్నారని తెలిపారు. నేనే మోదీని చంపేస్తానని మరొక నేత అన్నారన్నారు. రావణుడని ఓ నేత, రాక్షసుడని మరొక నేత, బొద్దింక అని మరో నేత తనను అవమానిస్తున్నారని తెలిపారు. తనను కాంగ్రెస్ నేతలు దూషించడం తనకేమీ ఆశ్చర్యంగా లేదన్నారు. కానీ అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ కాంగ్రెస్ పశ్చాత్తాపం చెందడం లేదని తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ విషయంలో ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుందన్నారు. తనకు గుజరాత్ ఇచ్చిన బలం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా ఉందన్నారు. 'మోదీకి ఆయన స్థాయి ఏమిటో ఈ ఎన్నికల్లో చూపిస్తామ'ని మరో కాంగ్రెస్ నేత అన్నారని తెలిపారు. అది సరిపోదని, ఇంకా ఏదో మాట్లాడవలసి ఉందని కాంగ్రెస్ భావించిందని, అందుకే ఖర్గేను పంపించిందని చెప్పారు. తాను ఖర్గేను గౌరవిస్తానన్నారు. ఆయన అడిగినదానికి సమాధానం చెప్పవలసి ఉందన్నారు. గుజరాత్ రామ భక్తుల రాష్ట్రమని కాంగ్రెస్‌కు తెలియదన్నారు. ఖర్గే ఇక్కడికి వచ్చి మోదీ 100 తలలుగల రావణాసురుడని అన్నారని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)