ప్రపంచమంతా ఇప్పుడు భారత్‌వైపు ఆసక్తిగా చూస్తోంది !

Telugu Lo Computer
0


జీ20 సదస్సు నిర్వహణకు సంబంధించి సోమవారం ప్రధాని అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేశంలోని 40 రాజకీయ పార్టీల నేతలు/వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. భారతదేశ అధ్యక్షతన జరగబోయే జీ20 సదస్సుకు సంబంధించి నిర్వహించనున్న కార్యక్రమాల గురించి ప్రధాని ఈ భేటీలో మాట్లాడుతూ  ఆయా కార్యక్రమాల నిర్వహణలో అన్ని పార్టీల నేతల సహకారం కావాలని కోరారు. దాదాపు ఏడాదిపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున విదేశీయులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. దేశంలో పర్యాటక, స్థానిక ఆర్థికవ్యవస్థల వృద్ధికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జీ20 అధ్యక్ష బాధ్యతలను నిర్వహించే అవకాశం రావడం భారతదేశానికి గర్వకారణమని, ఈ సదస్సును విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి సహకారం కావాలని ప్రధాని మోదీ అన్నారు. జీ20 సదస్సుకు అధ్యక్షత వహించడం దేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటడానికి లభించిన అపురూప అవకాశంగా అభివర్ణించారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత్‌వైపు ఆసక్తిగా చూస్తోందన్నారు ప్రధాని మోదీ అన్నారు. దేశానికి ఈ అవకాశం రావడం గర్వకారణంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు. అయితే, దీన్ని దేశ ప్రయోజనాల కోసం, సరిహద్దుల్లో చైనా దాడులను నివారించడానికి, ఆ దేశంతో ఉన్న వాణిజ్యపరమైన అసమతౌల్యాలను సరిచేసుకోవడానికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం సంపాదించడానికి, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలపై చర్యకు ఇతరదేశాల మద్దతును కూడగట్టడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పరారైనవారిని తిరిగి రప్పించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ఖర్గే మోదీకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. జీ-20 అధ్యక్షత ఒక పార్టీ ఎజెండా కాదని.. ఇది దేశం మొత్తానికీ సంబంధించిన అంశమని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశంలో వ్యాఖ్యానించారు. శాంతి, సామరస్యాలు, అహింస, సమన్యాయాల ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రధాని ఈ సదస్సును ఒక అవకాశంగా ఉపయోగించుకుంటారన్న విశ్వాసాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ వ్యక్తం చేశారు. కేంద్రానికి తమ పూర్తి సహాయసహకారాలు, మద్దతు ఉంటాయని స్పష్టం చేశారు. జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం భారతదేశానికి రొటేషన్‌ పద్ధతిలో వచ్చిందని, కాబట్టి దీన్ని ఏదో ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకోవద్దని సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా సహా పలువురు విపక్ష నేతలు ఈ భేటీలో సూచించినట్టు సమాచారం. కాగా.. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌, జేడీయూ చీఫ్‌ లలన్‌ సింగ్‌ హాజరు కాలేదు. ఆర్జేడీ ప్రతినిధులు ఈ సమావేశానికి రాలేదు. హాజరైనవారిలో.. ఏపీ సీఎం జగన్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌, రాజ్‌నాథ్‌ తదితరులు ఉన్నారు. జీ-20 సదస్సు వచ్చే ఏడాది సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనుంది. అప్పటిలోగా దేశవ్యాప్తంగా 200కు పైగా సన్నాహక సమావేశాలను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా.. జీ-20 సదస్సు లోగోగా కమలానికి బదులుగా వేరే ఏ జాతీయ చిహ్నాన్నైనా కేంద్రం వినియోగించి ఉండాల్సిందని టీఎంసీ చీఫ్‌ మమత అభిప్రాయపడ్డారు. కమలం ఒక రాజకీయ పార్టీ గుర్తు కూడా అని ఆమె అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)