మమతా బెనర్జీని కలిసిన బీజేపీ నేత సువేందు అధికారి

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని, బీజేపీ నేత సువేందు అధికారి తొలిసారి కలిశారు. వీరిద్దరి సమావేశం అందరినీ ఆశ్చర్య పరిచింది. శుక్రవారం బెంగాల్‌ అసెంబ్లీ క్యాంపస్‌లో ప్లాటినం జుబ్లీ స్మారక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన సువేందు అధికారిని తన చాంబర్‌కు సీఎం మమత ఆహ్వానించారు. దీంతో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అగ్నిమిత్ర పాల్, మనోజ్ తిగ్గాతో కలిసి అసెంబ్లీలోని మమత చాంబర్‌కు సువేందు అధికారి తొలిసారి వెళ్లారు. సీఎం మమతా బెనర్జీతో మూడు నిమిషాల పాటు మర్యాద పూర్వకంగా సమావేశమైనట్లు సువేందు అధికారి అనంతరం మీడియాతో అన్నారు. ఆమె చాంబర్‌లో తాను టీ కూడా తాగలేదని తెలిపారు. నందిగ్రామ్ నుంచి పోటీ చేయడం మమతపై వ్యక్తిగత పోరాటం కాదని అన్నారు. తనది రాజకీయ, సైద్ధాంతిక పోరాటమని చెప్పారు. బెంగాల్‌ కొత్త గవర్నర్‌గా సీవీ ఆనంద్‌ బోస్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరుకాని ఆయన మమతపై పలు విమర్శలు చేశారు. మరోవైపు సువేందు అధికారిని తన సోదరుడిగా భావించినట్లు సీఎం మమతా బెనర్జీ అన్నారు. టీ కోసం ఆయనను ఆహ్వానించినట్లు చెప్పారు. అలాంటి వ్యక్తి బెంగాల్‌లో ప్రభుత్వం 'పార్టీ ద్వారా, పార్టీ కోసం, పార్టీ కొరకు'గా మారిందని అంటున్నారని విమర్శించారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 'ఏజెన్సీ ద్వారా, ఏజెన్సీ కోసం, ఏజెన్సీ కొరకు'గా మరిందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై ఆమె మండిపడ్డారు. గత ఏడాది బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీని వీడిన సువేందు అధికారి బీజేపీలో చేరారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై పోటీ చేసి ఆమెను ఓడించారు. అనంతరం భవానీపూర్‌ ఉప ఎన్నికలో గెలిచిన మమతా బెనర్జీని 'కంపార్ట్‌మెంటల్‌ సీఎం' అని పలుమార్లు ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన సువేందు అధికారి నాటి నుంచి ఒక్కసారి కూడా సీఎం మమతా బెనర్జీని కలవలేదు. అయితే మమతా ఆహ్వానం మేరకు శుక్రవారం అసెంబ్లీలోని ఆమె చాంబర్‌కు వెళ్లి కలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)