కర్ణాటక అసెంబ్లీ కాంగ్రెస్‌ టికెట్ల కోసం దరఖాస్తుల వెల్లువ !

Telugu Lo Computer
0


రానున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్ల కోసం భారీగా డిమాండ్‌ నెలకొనడంతో ఆశావహుల వినతి మేరకు గడువును పెంచుతున్నట్లు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రకటించారు. గత పది రోజుల వ్యవధిలో 1100 మంది రూ.5వేల రుసుం చెల్లించి దరఖాస్తులు కొనుగోలు చేయగా వీరిలో 500 మంది నిర్దేశిత డిపాజిట్‌ రూ.2లక్షలు చెల్లించారు. కేపీసీసీ గత ఏడాది టికెట్ల దరఖాస్తు కోసమే ప్రత్యేక నియమావళిని రూపొందించింది. ప్రస్తుత ఏడాది నుంచే అమలు చేస్తున్నట్టు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రకటించిన సంగతి విదితమే. ఇంతవరకు 40 మంది సిట్టింగ్‌లు మాత్రమే మళ్లీ టికెట్‌ కోసం దరఖాస్తులు అందచేశారు. ఇంకా 20 మందికిపైగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులైతే రూ.2 లక్షలు, ఎస్సీ ఎస్టీలైతే రూ.లక్ష డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంది. ఒకే కుటుంబానికి ఒకే టికెట్‌ అనే సిద్ధాంతానికి అనుగుణంగా దరఖాస్తుల విషయంలోనూ అనుసరిస్తున్నారు. ఆశావహుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఈనెల 21 వరకు గడువును పొడిగిస్తూ కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రకటించారు. డిసెంబరు నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయనున్నారు. అనంతరం జనవరిలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలనకు ఈ జాబితాను పంపించనున్నారు. చివరి క్షణంలో ఇతర పార్టీల నుంచి వలసవచ్చే సీనియర్‌ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు గ్రీన్‌ కార్డ్‌ ఎంట్రీ పేరిట కొత్త వెసులుబాటును కేపీసీసీ టికెట్ల కేటాయింపులో కల్పించనున్న సంగతి విదితమే. కాగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తరపున ఎమ్మెల్సీ రవి, కేపీసీసీ కోశాధికారి వినయ్‌ కార్తిక్‌ మంగళవారం సాయంత్రం కనకపుర టికెట్‌ కోసం దరఖాస్తు సమర్పించారు.  దరఖాస్తులు సమర్పించేందుకు పెద్దసంఖ్యలో నేతలు తమ అభిమానులతో బెంగళూరు క్వీన్స్‌రోడ్డులోని ప్రధాన కార్యాలయంలో చేరుకోవడంతో కోలాహలం వాతావరణం నెలకొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)