అనంత ఆర్టీసీ డిపోలో నగదు మాయం ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ఆర్టీసీ డిపోలో బస్సు టికెట్లకు సంబంధించిన నగదు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబరు 16న డిపోకు చెందిన అనంతపురం-ఒంగోలు సర్వీసు అద్దె బస్సుకు సంబంధించిన సుమారు రూ.11 వేలు, అనంత నుంచి తిరుపతి, చెన్నై సర్వీసుకు సంబంధించిన సుమారు రూ.16 వేలు నగదును బస్సు డ్రైవర్లు, కండెక్టర్లు డిపోలో సంబంధిత అధికారికి అప్పజెప్పారు. ఆ సొమ్ము ఈనెల 8 వరకు జమ చేయలేదు. నెల ప్రారంభంలో అద్దె బస్సుల యజమానులు బిల్లులకోసం వెళ్లగా 'గత నెల 16న మీ బస్సులు తిరగలేదని వాటి బిల్లులు ఇవ్వలేమని' చెప్పడంతో వారు కంగుతిన్నారు. తాము బస్సులు నడిపామని అధికారులతో వాదనకు దిగారు. ఆ రోజు రెండు సర్వీసులకు చెందిన బిల్లులు, నగదు కనిపించడం లేదంటూ సిబ్బంది, అధికారులు హడావుడి చేశారు. వసూలైన నగదును కండక్టర్లు డిపోలో అధికారులకు అప్పగించినా వారు బ్యాంకు ఖాతాలో ఎందుకు జమ చేయలేదో ఉన్నతాధికారులకే తెలియాల్సి ఉంది. శనివారం డిపోలోని కొందరు అధికారులు, సిబ్బంది తలా కొంత డబ్బు వేసుకుని బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ ఘటనపై ఆర్టీసీ డిపో మేనేజరు నాగభూపాల్‌ వివరణ కోరగా అటువంటి ఘటనలేమీ జరగలేదని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)