ఢిల్లీ వన్డే లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపు

Telugu Lo Computer
0


ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయింది.  100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 8 పరుగులు చేసి రనౌట్‌గా వెనుతిరగ్గా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 49 పరుగులకు అవుటయ్యాడు. గత మ్యాచ్ హీరో ఇషాన్ కిషన్ 10 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్), సంజు శాంసన్ (2 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. మూడో వన్డేలో సులభంగా గెలవడంతో పాటు మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ధావన్ సేన కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫార్చ్యూన్, లుంగి ఎంగిడి తలో వికెట్ సాధించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా టీమిండియా బౌలర్ల ధాటికి కేవలం 27.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియాపై లోయెస్ట్ స్కోర్ నమోదు చేసి చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలోనే దక్షిణాఫ్రికా జట్టుకు ఇది నాలుగో అత్యల్ప స్కోర్. 34 పరుగులు చేసిన క్లాసెన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కుల్‌దీప్ యాదవ్(4/18) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. 4.1 ఓవర్లు మాత్రమే వేసిన కుల్‌దీప్ ఓ ఓవర్ మెయిడిన్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. తన ప్రదర్శనతో పాత కుల్‌దీప్ యాదవ్‌ను తలపించాడు. అటు మహమ్మద్ సిరాజ్(2/17), వాషింగ్టన్ సుందర్(2/15), షాబాజ్ అహ్మద్ (2/7) సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)