దేవాలయంలో తొక్కిసలాటలో ముగ్గురు మృతి

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని ఒక దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించారు. మరి కొంతమంది గాయపడ్డారు. రాజస్థాన్‌లోని శికర్ జిల్లాలో ఉన్న ఖాతు శ్యామ్‌జి దేవాలయంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. నెలకోసారి ఈ దేవాలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సోమవారం కూడా కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారక ముందే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం ఐదు గంటలకు దర్శనం మొదలైంది. అయితే, భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో చాలా మంది భక్తులు కింద పడిపోయారు. భక్తులు ఒకరిపై ఒకరు తోసుకుంటూ, తొక్కుకుంటూ వెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని జైపూర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో వైద్యం అవసరమైన వారికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)