మహిళల హాకీలో భారత్ కు కాంస్యం

Telugu Lo Computer
0


20 ఏళ్ల నిరీక్షణకు భారత మహిళల హాకీ జట్టు తెరదించింది. ఎప్పుడో 2002లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం గెలిచిన భారత మహిళల జట్టు మళ్లీ పతకం గెలవలేకపోయింది. గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని తృటిలో చేజార్చుకుంది. అయితే ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన కాంస్య పతక పోరులో భారత మహిళల జట్టు అద్భతాన్ని చేసి చూపించింది. కెప్టెన్ సవితా పునియా అద్భుత గోల్ కీపింగ్ కారణంగా భారత్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. పెనాల్టీ షూటౌట్ లో భారత్ 2-1 గోల్స్ తేడాతో కివీస్ పై గెలుపొందింది. గుండె ఆగిపోయేంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో సవితా పునియా మరోసారి తన కీపంగ్ నైపుణ్యాలను ప్రదర్శించి భారత మహిళల హాకీ జట్టు కలను తీర్చింది. కాంస్య పతక పోరులో ఇరు జట్లు కూడా గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. అయితే రెండో అర్ధ భాగంలో సలీమా గోల్ చేయడంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా భారత్ దూకుడుగా ఆడింది. దాంతో న్యూజిలాండ్ కు గోల్ చేసే అవకాశాలు రాలేదు. అయితే చివరి క్వార్టర్ అది కూడా ఆట మరో 30 సెకన్లలో ముగుస్తుందనగా, న్యూజిలాండ్ కు పెనాల్టీ కార్నర్ లభించింది. పెనాల్టీ కార్నర్ ను క్లియర్ చేసే క్రమంలో నవ్ నీత్ కౌర్ బంతిని కాలితో తన్నింది. దాంతో రిఫరీ కివీస్ కు పెనాల్టీ స్ట్రోక్ ను ఇచ్చాడు. పెనాల్టీ స్ట్రోక్ ను చక్కగా ఉపయోగించుకున్న ఒలివీయా స్కోరును లెవెల్ చేసింది. దాంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారి తీసింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో రిఫరీల తప్పుడు నిర్ణయానికి బలైన భారత జట్టు రోజు వ్యవధిలో మరో పెనాల్టీ షూటౌట్ ను ఆడుతుండగా, సగటు భారత అభిమానిలో ఏదో తెలియని భయం కలగిందనడంలో సందేహం లేదు. తొలి పెనాల్టీ స్ట్రోక్ ను గోల్ గా మలచిన న్యూజిలాండ్ ప్లేయర్ షూటౌట్ లో కివీస్ కు ఆధిక్యాన్ని ఇచ్చింది. భారత్ తన తొలి ప్రయత్నంలో గోల్ చేయలేకపోయింది. ఇక ఇక్కడి నుంచి సవితా పునియా తన మ్యాజిక్ ను చూపింది. న్యూజిలాండ్ రెండో గోల్ ప్రయత్నాన్ని అద్భుతంగా అడ్డుకుంది. అనంతరం సంగీత గోల్ చేయడంతో షూటౌట్ లో స్కోర్లు సమం అయ్యాయి. ఇక కివీస్ మూడు, నాలుగు ప్రయత్నాలను కూడా సవితా అడ్డుకుంది. భారత్ తన మూడో ప్రయత్నంలో గోల్ చేసి, నాలుగో ప్రయత్నంలో మిస్ అయ్యింది. కివీస్ ఐదో ప్రయత్నాన్ని సవితా అడ్డుకుంటే భారత్ కు కాంస్యం ఖాయం అవుతుందనే క్రమంలో ఆమె దానిని చేసి చూపించింది. ఫలితంగా భారత్ పెనాల్టీ షూటౌట్ లో 2-1తో నెగ్గింది 

Post a Comment

0Comments

Post a Comment (0)