ఉసురు తీసుకున్న మరో విద్యార్థిని !

Telugu Lo Computer
0


తమిళనాడులో కడలూర్ జిల్లాలో మంగళవారం పన్నెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఇటువంటి దారుణం జరగడం రెండు వారాల్లో ఇది మూడోది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ కార్తిక్ తెలిపిన వివరాల ప్రకారం, పన్నెండో తరగతి చదువుతున్న మైనర్ బాలిక మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌లో తాను ఐఏఎస్ చదవాలని తనపై తన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అయితే తాను వారి ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నానని పేర్కొన్నారు. ఈ బాలిక తల్లిదండ్రులు రైతులు. వారు పోలీసులకు సమాచారం అందజేయకుండా ఆమె అంత్యక్రియలను నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రయత్నాలను ఆపి, ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపించారు. అనుమానాస్పద మృతి కేసును నమోదు చేశారు. ఇదిలావుండగా, తిరువల్లూరు జిల్లాలోని సేక్రెడ్ హార్ట్ స్కూల్‌లో పన్నెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్‌లో సోమవారం మరణించి, కనిపించిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహం వద్ద సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. జిల్లా పోలీస్ చీఫ్ సెఫాస్ కల్యాణ్ మాట్లాడుతూ, ఈ కేసు దర్యాప్తును సీబీసీఐడీకి అప్పగించినట్లు తెలిపారు. జూలై 13న కల్లకురిచి జిల్లాకు చెందిన పన్నెండో తరగతి విద్యార్థిని మృతి చెందారు, ఈ కేసును కూడా సీబీసీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ విద్యార్థిని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్‌లో మరణించడంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో పోలీసులు, సాధారణ పౌరులు కూడా గాయపడ్డారు. ఈ విద్యార్థినిని ఇద్దరు టీచర్లు అవమానించినట్లు ఓ నోట్ పోలీసులకు దొరికింది. దీంతో ఆ ఇద్దరు టీచర్లు, స్కూల్ ప్రిన్సిపాల్, సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అయితే నేరం జరిగిన ప్రదేశంలో శారీరకంగా ఘర్షణ జరిగినట్లు కనిపిస్తోందని ఈ బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో మరోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని మద్రాస్ హైకోర్టుఆదేశించింది. విద్యా సంస్థల్లో సంభవించే మరణాలపై సీబీసీఐడీ దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్  స్పందిస్తూ, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలను విడనాడాలని విద్యార్థినులను కోరారు. కష్టాలను విజయాలుగా మార్చుకోవాలని కోరారు. విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)