గోదావరిపై మరో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే ప్రతిపాదన లేదు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ధవళేశ్వరం దగ్గర కొత్త ప్రాజెక్టు చేపట్టాలని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ పోలవరానికి దిగువన గోదావరి నదిపై మరో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి ప్రతిపాదనలు లేవని గజేంద్ర షెకావత్ తేల్చి చెప్పారు.ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు వస్తే సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని గజేంద్ర షెకావత్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ కెపాసిటీ 30 లక్షల క్యూసెక్కులేనన్నారు. గోదావరి నదికి వచ్చిన భారీ వరద కారణంగా పోలవరం ప్రాజెక్టు లోయర్ కాఫర్ డ్యామ్ స్వల్పంగా దెబ్బతిందని కేంద్ర జల్ శక్తి మంత్రి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి పనులను నిరంతరం తెలుసుకొంటున్నామని మంత్రి షెకావత్ తెలిపారు. 1986 లో వచ్చిన వరద కంటే ఈ ఏడాది గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. గోదావరి నది భద్రాచలం వద్ద నీటి మట్టం 70 అడుగులు దాటి ప్రవహించింది. దీంతో భద్రాచలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో పాటు గోదావరికి వచ్చిన వరదతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులు కూడా గోదావరి జలంతో నిండిపోయాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల వరకు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని భయంతో గడుపుతున్న పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతాల్లో నీరు తగ్గుముఖం పట్టింది. గోదావరి నదికి జూలై మాసంలోనే వరదలు రావడంతో రానున్న రోజుల్లో వరదల పరిస్థితి ఎలా ఉంటుందనే విషయమై కూడా పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళనతో ఉన్నారు. గోదావరి నదికి ఈ ఏడాది జూలై మాసంలో 100 ఏళ్లలో రానంత స్థాయిలో వరదలు వచ్చినట్టుగా అధికారులు వెల్లడించారు. ఆగష్టు, సెప్టెంబర్ మాసంలో ప్రతి ఏటా గోదావరి నదికి వరదలు వస్తాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం జులై నెలలోనే వరదలు విరుచుకుపడ్డాయి. ఇప్పటికే గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులు దాదాపుగా నిండిపోయాయి. అయితే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో గోదావరికి వరదలు వస్తే పరిస్థితి ఎలా అనే ఆందోళన కూడా ముంపు గ్రామాల ప్రజలను వెంటాడుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)