గో మూత్రం లీటరు నాలుగు రూపాయలు !

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం గో మూత్రం లీటరుకు రూ.4 చొప్పున రైతులు, పెంపకందారుల నుంచి కొనుగోలు చేయాలని  నిర్ణయించింది. జూలై 28న స్థానిక హిరేలి పండుగ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ మేరకు శుక్రవారం వెల్లడించారు. మరో రెండు వారాల్లో ఉత్తర జిల్లాల్లో ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఇప్పటికే రైతులు, ఆవుల పెంపకందారుల నుంచి ఆవు పేడను సేకరిస్తున్నది. దీనికి డబ్బులు కూడా చెల్లిస్తున్నది. పాలు ఇవ్వని ఆవులను రోడ్లపై వదిలేయకుండా, అవి భారం కాకుండా ఉండేందుకు, పశువుల పెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు 2020 జూన్‌ 25న ఈ పథకాన్ని ప్రారంభించింది. మరోవైపు దీని మాదిరిగానే గో మూత్రాన్ని కూడా సేకరించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ పథకంపై పరిశోధనకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఒక ప్రతిపాదన చేసిందని, దానిని త్వరలో సీఎం భూపేష్ బఘేల్ ముందు ఉంచుతామని సీఎం సలహాదారుడు ప్రదీప్ శర్మ తెలిపారు. గో మూత్రాన్ని లీటరుకు రూ.4 చొప్పున కొనుగోలు చేయాలని కమిటీ నిర్ణయించిందని చెప్పారు. ఈ ప్రతిపాదనను సీఎం ఆమోదించాల్సి ఉందన్నారు. గ్రామ గౌతన్ సమితి ద్వారా గో మూత్రాన్ని కొనుగోలు చేసి యజమానులకు 15 రోజులకు ఒకసారి డబ్బులు చెల్లిస్తామని ప్రదీప్ శర్మ తెలిపారు. సేకరించిన గో మూత్రాన్ని వ్యవసాయంలో వినియోగించే సేంద్రీయ పురుగుమందుల తయారీకి మాత్రమే వినియోగిస్తారని వెల్లడించారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం మాదిరిగా వ్యవహరిస్తున్నదంటూ ఆ రాష్ట్రంలోని మిగతా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)