సోషల్‌మీడియాలో యువతులపై వల

Telugu Lo Computer
0


ఇన్‌స్టాగ్రామ్‌ సోషల్‌మీడియాను మోసాలకు అడ్డాగా మార్చుకున్న ఓ ప్రబుద్ధుడు వందమందికిపైగా అమ్మాయిల నుంచి రూ. కోట్లు దండుకున్నాడు. ఐదేళ్లుగా ఇదే తరహా మోసాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వస్తున్నాడు. తాజాగా అమెరికాలో స్థిరపడిన ఓ యువతి ఫిర్యాదుతో మరోసారి హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు పీటీ వారంట్‌పై అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని  రాజమండ్రికి చెందిన జోగడ వంశీకృష్ణ బీటెక్‌ పూర్తి చేశాడు. జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం వక్రమార్గం పట్టాడు. హైప్రొఫైల్‌ వ్యక్తిలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఐడీ క్రియేట్‌ చేసి, పారిశ్రామిక వేత్తలా బిల్డప్‌ ఇచ్చి అమ్మాయిలకు వలవేసి, అందినకాడికి డబ్బులు గుంజేవాడు. తర్వాత వారిని బెదిరించడం చేస్తుండేవాడు. ఈక్రమంలో 2017 నుంచి ఇప్పటివరకు నగరంలోని మూడు కమిషనరేట్లు సహా రెండు రాష్ట్రాలలోని పలు పీఎ్‌సలలో చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 16కేసులు నమోదు కాగా ఇతగాడి బారిన పడి మోసపోయిన యువతుల సంఖ్య వందకు పైగానే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అమెరికాలో స్థిరపడిన నగరానికి చెందిన ఓ యువతి వీరి బారిన పడి రూ.25లక్షలు పోగొట్టుకుంది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పీటీ వారంట్‌పై గత నెల 30న వంశీకృష్ణను అరెస్టు చేశారు. మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు అనంతరం 13న తిరిగి జైలుకు తరలించారు. అమ్మాయిలు అయితే బయటకు చెప్పుకోవడానికి భయపడతారని, అదీ కాకుండా సులువుగా ట్రాప్‌ చేయవచ్చని భావించిన కేటుగాడు వంశీకృష్ణ పక్కా స్కెచ్‌తో మోసాలకూ పాల్పడుతున్నాడు. అందమైన అమ్మాయిల ప్రొఫైల్‌ చిత్రాలతో మూడు ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలు క్రియేట్‌ చేశాడు. ఇంకొకటి ఓ రాష్ట్రానికి చెందిన యువ ఎమ్మెల్యే పేరుతో క్రియేట్‌ చేశాడు. ఈ నాలుగు ఐడీల ద్వారా గ్రూప్‌ చాట్‌ చేస్తున్నట్లు, షేర్‌మార్కెట్‌ ఇతరత్రా పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లుగా ఖరీదైన కార్లు ఇతరత్రా ఫొటోలు షేర్‌ చేసేవాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే యువతులను ఎంచుకుని వారికి మెసేజ్‌లు చేయడం, తర్వాత వారితో పరిచయం పెంచుకుని వ్యాపారాలలో పెట్టుబడులపై భారీలాభాలు వస్తున్నాయంటూ నమ్మించేవాడు. మీరు కూడా పెట్టుబడులు పెట్టండి అంటూ ముగ్గులోకి లాగేవాడు. అతని మాటలు నమ్మిన ఎంతో మంది యువతులు రూ.లక్ష నుంచి నలబై లక్షల వరకు చొప్పున పెట్టుబడులు పెట్టారు. ఇదే తరహాలో అమెరికాలో స్థిరపడిన హైదరాబాద్‌ యువతిని షేర్‌మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ముగ్గులోకి లాగాడు. మధ్యలో తనకు అర్జెంట్‌గా రూ.25లక్షలు కావాలని, వారం రోజుల్లో అత్యధిక వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తానని నమ్మించడంతో యువతి నగరంలో ఉన్న తన తండ్రికి నిందితుడి అకౌంట్‌ నెంబర్‌ పంపించి రూ.25లక్షలు డిపాజిట్‌ చేయించింది. నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడం, పైగా బెదిరింపులకు పాల్పడడంతో మోసపోయానని గ్రహించిన యువతి సైబర్‌క్రైమ్స్‌ పోలీసులకు ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. యువతి తండ్రి కూడా పీఎ్‌సకు వచ్చి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)